ఆంధ్రప్రదేశ్ లో మీడియాకు వచ్చిన సమస్య ఏమీలేదని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రవాణా, సమాచార శాఖల మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన జీవోపై కొంత మంది కళానికి సంకెళ్లు అని..మరేదో కథనాలు రాస్తున్నారని..ప్రతిపక్ష టీడీపీ కూడా హంగామా కూడా చేస్తోందని విమర్శించారు. ఆధారాలతో వార్తలు రాసిన వారెవరికీ ఇబ్బంది ఉండదని..కావాలని..దురుద్దేశపూరితంగా ప్రభుత్వంపై బురదజల్లాలని చూసిన వారి గురించే తాము మాట్లాడుతున్నామని పేర్ని నాని తెలిపారు. కేంద్ర చట్టాల ప్రకారమే పత్రికల నియంత్రణ ఉంటుంది కానీ..పత్రికల్లో ఏ వార్త ఎక్కడ రాయాలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్ట్ ల స్వేచ్ఛ కు వచ్చిన ముప్పు ఏమి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఓ పత్రికా స్వేచ్ఛ కు ఏ మాత్రం విఘాతం కాదని తెలిపారు. రాజకీయ దురుద్ధేశాలతో ప్రభుత్వం పై నిరాధార వార్తలు రాస్తే సంబంధిత కార్యదర్శి స్పందనను ప్రచురించాలని జీఓ చెబుతోంది. సంబంధిత శాఖ కార్యదర్శి తన వివరణ ప్రచురించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అనుమతించామని తెలిపారు. రిజాయిండర్ ఇచ్చినా ప్రచురించకపోతే ప్రభుత్వం ఏమి చేయాలి. రాష్ర్టంలోని కొన్ని పత్రికా యాజమాన్యాలు సుప్రీంకోర్టు కన్నా తామే ఉన్నతులన్న భావనలో ఉన్నారు.
రాష్ట్రంలోని మీడియాకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉన్నాయని ఆరోపించారు. మరో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కలానికి సంకెళ్లు కాదు కులానికి సంకెళ్లు అనే భావనలో పత్రికాధిపతులు ఉన్నారు. నిత్యం తమ కులమే రాజ్యం చేయాలనే భావనలో మీడియా యజమానులు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలులో అప్పటి ఎండి సురేంద్రబాబు సహకరించలేదని ప్రభుత్వం బదిలీ చేసారని తప్పుడు వార్త రాశారు. తప్పుడు వార్తపై రవాణా శాఖ కార్యదర్శి, సురేంద్ర బాబులు రిజాయిండర్ ఇచ్చినా ప్రచురించ లేదు. తప్పుడు వార్తలు కావాలని రాస్తే కోర్ట్ లకు వెళ్ళమని సంబంధిత శాఖ కార్యదర్శలకు అనుమతించాం. కలానికి సంకెళ్లు కాదు కులానికి...తప్పుడు వార్తలు రాసే వారికి సంకెళ్లు. నీతి నిజాయితీ ఉన్న పత్రికలు.. జర్నలిస్ట్ లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని వ్యాఖ్యానించారు.