ఇసుక వారోత్సవాలా..సిగ్గుండాలి

Update: 2019-10-30 08:09 GMT

వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామనడం సిగ్గుచేటు అన్నారు. గతంలో నరకాసురుడు, రావణాసురుడు, బకాసురుడు ఉన్నారని... ఇప్పుడైతే ఊరికో వైసీపీ ఇసుకాసురులు తయారయ్యారని వ్యాఖ్యానించారు. నరకాసురుడి అంతంతోనే దీపావళి వచ్చిందని.. ఇక ఇసుకాసురుల భరతం పడితేనే పేదలకు దీపావళి వస్తుందని చెప్పారు. ఒక పక్క ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ‘నీకు మాత్రం వారోత్సవాలా’..?, ఇసుకపై, మట్టిపై నీ పెత్తనం ఏమిటి..?, సొంత పొలంలో ఉండే మట్టి తీసుకెళ్లడానికి నీ అనుమతి కావాలా..?, సొంత ఊళ్లో వాగు ఇసుక తీసుకెళ్లడానికి నీ అనుమతి కావాలా..? అంటూ’ విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో లేని ఇసుక కొరత ఏపీలోనే ఎందుకొచ్చింది..? , దేశంలో ఎక్కడా లేని ఇసుక కొరత సృష్టించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తక్షణమే ఇసుకపై సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఇసుక నియంత్రణ పేరుతో వైసీపీ నేతల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. ఇసుక స్మగ్లర్లు కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్నారు. మీ తీరు వల్ల నిరుపేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ‘కూలీలకు అండగా ఉండేవాళ్లను.. రాబందుల్లా రాళ్లేస్తున్నారని అంటారా..?, రాబందులు మేము కాదు, రాక్షసుల్లా మీరే వ్యవహరిస్తున్నారని’ విమర్శించారు.

 

 

Similar News