ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రయాణికులు 73 కాదు..93 మంది ఉన్నారని అన్నారు. అంతే కాదు..దేవీపట్నం ఎస్ఐ వద్దని వారించినా మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయటం వల్లే బోటును అనుమతించారని ఆరోపించారు. బోటు జాడ వాస్తవానికి సోమవారమే తెలిసిందని..దాన్ని బయటకు తీసేందుకు అధికారులు సుముఖంగా లేరని అన్నారు. ఫ్లోటింగ్ జట్టీ ద్వారా మునిగిన బోటును బయటకు తీయవచ్చని..కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగటంలేదన్నారు.
గోదావరిలో తిరిగే బోట్లలో కొంత మంది నాయకులు, పర్యాటక శాఖ అధికారుల పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. జగన్ ను ఈ విషయంలో కొంత మంది అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అయితే హర్షకుమార్ ఆరోపణలపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపారు. బోటుకు అనుమతించాల్సిందిగా తాను ఎవరికీ ఫోన్ చేయలేదని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా మంత్రి దగ్గర నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని తెలిపారు.