నిపుణులైన డ్రైవర్లు లేకపోవటం వల్లే గోదావరిలో బోటు ప్రమాదం జరిగిందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. దీనికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణం అని ప్రాధమిక పరిశీలనలో తేలిందని ఆయన వ్యాఖ్యానించారు. గోదావరి వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో పర్యాటక శాఖ బోట్లు అన్ని నిలిపివేశామని..ప్రైవేట్ బోటులో ప్రయాణికులు వెళ్లారన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నిపుణులైన డ్రైవర్లు మాత్రమే బోట్లను సరిగా నడపగలరని తెలిపారు.
బోటు పై భాగంగా పార్టీ చేసుకుంటూ అందరూ ఓ వైపు చేరటంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోందని..పూర్తి పరిశీలన అనంతరమే విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. అధికారుల ఇదే అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కొంత మంది ప్రయాణికులు లైఫ్ జాకెట్లు వేసుకోకుండా పక్కన పడేశారని చెబుతున్నారు.