కొంత మంది ప్రచారం చేస్తున్నట్లుగా పోలవరం ఎత్తు తగ్గించే ప్రశ్నేలేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రస్తుత డిజైన్ల ప్రకారమే ముందుకెళతామని అన్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. పోలవరం ఆగిపోయిందని..ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఐదేళ్ళు పడుతుందని టీడీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రెండేళ్ళలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే టీడీపీని మూసేస్తారా? అని సవాల్ విసిరారు. ఇప్పటికే ప్రజలు 23 సీట్లు ఇచ్చి మూసేసే పరిస్థితి కల్పించారని..ఇలాగే వ్యవహరిస్తే నిజంగానే మూసి వేయాల్సి వస్తుందని అన్నారు. రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టులోనే 780 కోట్లు ఆదా చేశామని తెలిపారు. ప్రజల సొమ్ము మిగిల్చితే టీడీపీకి బాధ ఎందుకు అన్నారు. టీడీపీ హయాంలో అన్నీ నాలుగు శాతంపైనే ఎక్సెస్ కు ఇచ్చారని..తాము తక్కువగా ఇస్తే పారదర్శకత అంటారా? లేక ఎక్కువగా ఇస్తే తప్పా? అని ప్రశ్నించారు.
ఇరిగేషన్ శాఖ ద్వారా ఇప్పటికే 830 కోట్ల రూపాయలను ఆదా చేశామని తెలిపారు. మెఘా ఇంజనీరింగ్ క్వాలిటీతో..వేగంగా పనులు చేస్తుందని..తాము టీడీపీలా కాకుండా అన్ని అంశాలను జాగ్రత్తగా చూస్తామని తెలిపారు. నవయుగా నామినేషన్ లో అయితేనే పాల్గొంటుందని..పోటీకి ఎందుకు ఆ సంస్థ రాలేదని అనిల్ ప్రశ్నించారు. మీలో మీరు ఏ లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయో అని ఎద్దేవా చేశారు. నవయుగా ను పాల్గొనవద్దని తామేమీ చెప్పలేదన్నారు. ప్రజల సొమ్మును కాపాడే బాధ్యతను సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టారని ఇది గర్వించదగ్గ అంశం అన్నారు.