రాజధాని అమరావతిలో ఉంచుతారా...లేదా?. ఏదో ఒకటి తేల్చండి. నాన్చకండి. ఇప్పటికే అమరావతిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు వచ్చాయని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాజధాని అంశాన్ని నాన్చొద్దు అన్నారు. ఆయన బుధవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పించారు. వరద నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాజధానిపై మంత్రులు బొత్స, అవంతి శ్రీనివాస్ లు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని..వీళ్లు చెబుతున్నది వ్యక్తిగత అభిప్రాయమా?. ప్రభుత్వ అభిప్రాయమా? అని ప్రశ్నించారు.
రాజధాని విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఇఫ్పటికే సర్కారు అక్కడ వేల కోట్ల రూపాయల వ్యయంతో చాలా భవనాలు నిర్మించిందని తెలిపారు. పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో పీపీఏ అథారిటీ లేఖను ఏపీ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా అనుమతి తీసుకున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పటం వెనక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.