ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న అక్రమ కట్టడం ఇప్పుడు ముంపు ముప్పులోకి వెళుతోంది. కృష్ణా బ్యారేజీకి పెద్ద ఎత్తున నీరు వస్తుండటంతో పాటు..అన్ని గేట్లు ఎత్తేశారు. నదీ పరివాహక ప్రాంతంలో అసలు శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నా..అక్కడ మాత్రం అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. ఆ తర్వాత దీన్ని చంద్రబాబునాయుడు తన నివాసంగా మార్చుకున్నారు.
ఇప్పుడు వరద ముంపుతో ఈ నివాసం మరోసారి వార్తల్లో నిలిచింది. వరద ముంపున బారిన పడకుండా చంద్రబాబు నివాసంలో నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేస్తున్నారు. వరదల నేపథ్యంలో ఇప్పటికే బాబు కాన్వాయ్‌ను హ్యాపీ రిసార్ట్స్ కి తరలించారు. ఇంట్లోని కింది గదుల్లో ఉన్న సామాన్లను మేడపైకి తరలించారని వార్తలు వచ్చాయి. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. వరదలు ఇలాగే కొనసాగితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు.