టీడీపీ నుంచి బిజెపిలోకి మారిన కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉండగా టీడీపీ చేసిన ధర్మపోరాట దీక్షలను ఆయన ఇప్పుడు ‘అధర్మ దీక్ష’లుగా అభివర్ణించారు. ఈ దీక్షలు వద్దని తాను చెప్పానని..అయినా కొంత మంది మాటల వల్ల చంద్రబాబు దీక్షలు చేశారని ఆరోపించారు. అయితే క్రమశిక్షణ గల కార్యకర్తగా అప్పుడు వాటిపై బహిరంగంగా మాట్లాడలేదని తెలిపారు. బిజెపిలో చేరిన తర్వాత సుజనా చౌదరి తొలిసారి విజయవాడకు వచ్చిన ఆయన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.
తాను ఇప్పటివరకూ పరోక్ష రాజకీయాల్లో ఉన్నాను. బీజేపీలో చేరాక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నానని ప్రకటించారు. ప్రపంచ దేశాల ముందు దేహీ అనే ప్రధానులే ఉన్నారు కానీ భారతదేశం గొప్పతనాన్ని చాటింది ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ నిర్ణయాలు ఏపీ అభివృద్ధి వైపే ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా చేసేందుకే తాను భారతీ జనతా పార్టీలో చేరాను.’అని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో టీడీపీకి చెందిన మరికొంత మంది నేతలు బిజెపిలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది.