ఈ ఏడాది నుంచే రైతులకు పెట్టుబడి సాయం

Update: 2019-07-24 07:58 GMT

జగన్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు భరోసా ఈ ఏడాది నుంచే అమలు చేయనున్నట్లు సర్కారు అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఏపీ ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం గురించి ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి రైతులకు రూ. 12,500 ఇస్తామని చెప్పారు. 64లక్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందుతారని, ఇందులో 16లక్షల మంది కౌలు రైతులు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఈ పథకంలో భాగంగా ఈ ఏడాది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.8,750 కోట్లు బడ్జెట్‌లో కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీ హయాంలో నీరు-చెట్టు పథకం పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని, కేటాయింపులకు మించి ఆరు రెట్లు అదనంగా ఖర్చు పెట్టి.. టీడీపీ నేతలు తమ జేబులు నింపుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సర్కార్‌ ప్రవేశపెట్టిన ఓటాన్‌ బడ్జెట్‌లో రుణమాఫీకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని బుగ్గన వెల్లడించారు.

Similar News