ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూలై 30 వరకూ

Update: 2019-07-10 07:42 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30 వరకూ కొనసాగనున్నాయి. గురువారం నాడు సమావేశాలు ప్రారంభం కానుండగా..శుక్రవారం నాడు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల షెడ్యూల్ ఖరారు కోసం శాసనసభ కార్యకలాపాల వ్యవహారాల సలహామండలి (బీఏసీ) సమావేశం శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన బుధవారం జరిగింది. స్పీకర్‌ ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, సభా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు.

శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మంత్రులు కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. శని, ఆదివారం మినహా మొత్తం 14 పనిదినాలు పాటు శాసనసభ జరగనుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేస్తారు.

Similar News