నా భార్యను అప్పగించకపోతే ఆత్మహత్యే

Update: 2019-06-10 05:04 GMT

నా భార్యను నాకు అప్పగించండి. లేదంటే ఆత్మహత్య చేసుకుంటాం. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇదీ ఓ యువకుడి డిమాండ్. విషయం ఏమిటంటే తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని..ఆరు నెలల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అమ్మాయిని తమ వెంట తీసుకెళ్ళారని..అంతే కాదు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. బాధితుడు హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం పెట్టి మరీ వివరాలు వెల్లడించారు. బాధితుడు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన పొన్నాన ప్రభాస్‌. తాను హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఉంటూ బిఎఫ్‌ఏ చదువుతున్నట్లు తెలిపారు. గత డిసెంబర్‌లో అదే ప్రాంతంలోని లోధా అపార్ట్‌ మెంట్‌లో ఉంటున్న తన్వి అనే యువతితో పరిచయం ఏర్పడటంతో ఇద్దరం ప్రేమించుకున్నట్లు తెలిపాడు. ఫిబ్రవరి 15న శ్రీనగర్‌కాలనీలోని సాయిబాబా దేవాలయంలో స్నేహితులు, తన్వి సోదరి సమక్షంలో పెళ్లి చేసుకున్నామన్నారు. తన్వి తరచూ తనను వారి ఇంటికి తీసుకువెళ్లేదని, వారి అమ్మతో మాట్లాడే వాడినని తెలిపాడు. గత ఆరు నెలలుగా అదే అపార్ట్‌ మెంట్‌లోనే ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని ఉంటున్నామన్నారు.

గత నెల 7న తన్వీ కుటుంబసభ్యులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి గృహనిర్భంధం చేశారని, అదే రోజు రాత్రి కెపీహెచ్‌బీ పోలీసులు తనను బలవంతంగా అరెస్టు చేసి తీసుకు వెళ్లారని, స్టేషన్‌లో మూడు గంటల పాటు చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిపాడు. పోలీసుల ఎదుటే తన్వి తండ్రి శ్రీనివాసరావు కొందరు వ్యక్తులు తనపై దాడి చేశారని, తన ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి తన భార్య దుస్తులు, పెళ్లి జరిగిన ఆధారాలను తీసుకెళ్లినట్లు తెలిపారు. తన ఫోన్, ల్యాప్‌ట్యాప్, ఇంట్లో ఉన్న బంగారం కూడా తీసుకెళ్లారని ఆరోపించాడు. న్యాయం చేయాల్సిన పోలీసులే నిందితులతో చేతులు కలిపి తనను వేధిస్తున్నారని ఆరోపించాడు. ప్రతీ రోజు తనను చంపేస్తామని బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, తన ప్రాణాలకు హాని ఉందన్నారు.

 

 

Similar News