జ‌గ‌న్ వ్యాఖ్య‌లు... చంద్ర‌బాబు, కెసీఆర్ ల‌కు షాక్

Update: 2019-06-13 10:11 GMT

ఓ వైపు తెలంగాణ‌లో ఫిరాయింపుల ర‌చ్చ న‌డుస్తోంది. టీడీపీ సంగ‌తి స‌రేస‌రి. గ‌త ప్ర‌భుత్వంలో ఏకంగా 23 మంది ఎమ్మెల్యే ల ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించి..అందుల న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చి మ‌రి సత్క‌రించింది. దీనిపై టీడీపీ తీవ్ర విమ‌ర్శ‌ల పాలైంది. ఇప్పుడు తెలంగాణ లో కెసీఆర్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ల విలీనంతో ఆ పార్టీ ప్ర‌తిష్ట కూడా మ‌స‌క‌బారింది. ఈ త‌రుణంలో ఏపీ అసెంబ్లీలో సీఎం జ‌గన్మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపాయి. చంద్ర‌బాబుకు ప్ర‌స్తుతం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కొంత మందిని లాక్కుని క‌నీసం అపొజిష‌న్ స్టేట‌స్ కూడా లేకుండా చేద్దామ‌ని కొంత మంది చెప్పారు. నేను ఒక‌టే చెప్పాను. అలా చేస్తే వాళ్ళ‌కు మ‌న‌కు తేడా ఏమి ఉంటుంద‌ని చెప్పారు. ఎవ‌రు పార్టీలోకి వ‌చ్చినా రాజీనామా చేసి రావాల్సిందేన‌ని అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ఎవ‌రైనా ఫిరాయింపులు చేస్తే వాటిని ప్రోత్స‌హించ‌వ‌ద్ద‌ని..వెంట‌నే వారిపై వేటు వేయాల‌ని స్పీక‌ర్ కు సూచించారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు మాజీ సీఎం చంద్ర‌బాబుతోపాటు తెలంగాణ సీఎం కెసీఆర్ కు కూడా షాక్ లాంటివే అన్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అదే స‌మ‌యంలో కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు త‌మ‌కు ట‌చ్ లో ఉన్నార‌ని చేసిన వ్యాఖ్య‌లు కూడా క‌ల‌క‌లం రేపాయి. ‘వైఎస్సార్‌సీపీ నుంచి 67 మంది గెలిస్తే.. ఏకంగా ఇదే శాసనసభలోనే 23మందిని పార్టీ మార్చి.. కండువాలు కప్పి.. అందులో నలుగురిని మంత్రులను చేశారు. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను తుంగలోకి తొక్కారు.

ప్రతిపక్ష బెంచ్‌ల్లో కూర్చోవాల్సిన సభ్యులను సభలోని ట్రెజరీ బెంచ్‌ల్లో కూచుబెట్టుకున్నారు. చివరకు స్పీకర్‌ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నప్పుడు.. అవిశ్వాస తీర్మానం నిబంధనలను అప్పటికప్పడు రాజ్యాంగ విరుద్ధంగా మార్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని, అప్పుడే మేం సభకు వస్తామని చెప్పినా.. కనీసం పట్టించుకోలేదు. శాసనసభ అంటే శాసనాలు చేసే సభ. కానీ, దానినేచట్టం, రాజ్యాంగంతో సంబంధం లేని సభగా మార్చేశారు. అనర్హత వేటు వేయని ప్రభుత్వం మీద ప్రజలే అనర్హత వేటు వేస్తే ఎలా ఉంటుందో తాజా ఎన్నికల్లో చూశాం’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.‘దేవుడు కూడా చాలా గొప్ప స్క్రిప్ట్‌ రాశారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వారికి అక్షరాల 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ముగ్గురు ఎంపీలను కొన్నవారికి మూడు ఎంపీ సీట్లే వచ్చాయి. అది కూడా 23వ తారీఖున వచ్చాయి. దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్‌ రాస్తాడో చెప్పడానికి ఇది నిదర్శనం. బ్యూటీ ఆఫ్‌ డెమొక్రసీ, బ్యూటీ ఆఫ్‌ గాడ్స్‌ గ్రేస్‌ ఈ చట్టసభలో మళ్లీ ఇవాళ చూస్తున్నాం. అన్యాయం చేస్తే శిక్ష ఎలా ఉంటుందని చెప్పడానికి నిదర్శనంగా మళ్లీ మనం ఇవాళ ఏకమయ్యాం. అటు టెండర్ల వ్యవస్థలోగానీ, గ్రామస్థాయిలోగానీ, ప్రభుత్వ యంత్రాంగంలోగానీ అవినీతిని తొలగించి.. విలువలు, విశ్వసనీయతకు ఏపీని కేరాప్‌ అడ్రస్‌గా మార్చేందుకు మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే స్పీకర్‌గా సీతారాంను ఎన్నుకున్నాం. ఒక స్పీకర్‌, ఒక సభా నాయకుడు ఎలా ఉండకూడదో చెప్పడానికి గత శాసనసభ నిదర్శనమైతే.. ఎలా ఉండాలో చెప్పడానికి ఈ శాసనసభ, ఈ ప్రభుత్వం కంకణ కట్టుకుంది.

Similar News