ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేషీలో మాజీ సీఎస్ అజయ్ కల్లాం కీలక పాత్ర పోషించనున్నారు. ప్రభుత్వం ఆయన్ను కేబినెట్ హోదాతో ముఖ్య సలహాదారుగా నియమించింది. సీఎం కార్యాలయానికి సంబంధించిన కీలక వ్యవహారాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ తరహా నియామకం ఇదే మొదటిసారి. పదవి విరమణ చేసిన సీఎస్ ఏకంగా సీఎం కార్యాలయాన్ని లీడ్ చేయటం కొత్త మోడల్ అనే చెప్పొచ్చు. సీఎంవో కార్యదర్శులకు శాఖలను కేటాయించే బాధ్యత కూడా ఆయనకే అప్పగించారు.
ప్రభుత్వ సలహాదారులతోపాటు రాష్ట్రంలో ఏ శాఖకు చెందిన అధికారినైనా పిలిచి సలహాలు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు కల్పించింది. అందరూ ఆయనకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ కాకముందు ఉన్న టీఏ, డీఏలు వర్తిస్తాయి. ప్రభుత్వ వాహనంతోపాటు నివాస వసతి సౌకర్యం కల్పిస్తారు. లేదంటే ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది.