చంద్రబాబుకు ఎంత అవమానం?

Update: 2019-05-07 09:10 GMT

కేబినెట్ లో ఏమేమి ఏజెండాగా పెట్టాలో నిర్దేశించాల్సిన ముఖ్యమంత్రికి...అసలు మీరు కేబినెట్ లో ఏమి చర్చించదలచుకున్నారో చెప్పండి అనే ప్రశ్న ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ అవమానం అవసరమా?. అంటే అది పూర్తిగా స్వయంకృతం. సర్వాధికారాలు ఉన్న సీఎం మంత్రివర్గ సమావేశం పెట్టండి అంటే..అంతా ఓకే అంటారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. నిబంధనలు అంగీకరించవు. అసలు మీరు కేబినెట్ లో ఏమి మాట్లాడదామనుకుంటున్నారో చెప్పండి?. అప్పుడు అసలు అవి చర్చించవచ్చో లేదో ఈసీ చెబుతుంది అన్న సమాధానం. రెండవ సారి ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా కోడ్ ముగిశాక..ఫలితాల వెల్లడి తర్వాతే మంత్రివర్గ సమావేశం పెట్టుకున్నారు. కానీ ఎన్నికలు ముగిసి..ఫలితాల వెల్లడి కావాల్సిన ఉన్న తరుణంలో చంద్రబాబు మంత్రివర్గ సమావేశానికి నిర్ణయించటం అధికార వర్గాల్లో పెద్ద కలకలమే రేపింది. చంద్రబాబు నోట్ కు సీఎస్ వివరణ కోరారు. అసలు ఏమి చర్చించాలకుంటున్నారో చెపితే..అవి ఈసీకి పంపి..అనుమతిస్తేనే మంత్రివర్గం . లేదంటే లేదు అని తేల్చిచెబుతున్నారు.

ఇది ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నేతగా..ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన ప్రతిష్టను తాను తగ్గించుకున్నట్లు కాదా?. సీఎం ఏజెండా చెప్పి సీఈసీతో నో చెప్పించుకున్నా అవమానమే?. లేదు లేదు అసలు మేం సమావేశం జరపం అన్నా కూడా అవమానమే. బిజినెస్ రూల్స్ సమీక్షిస్తా...తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటా. కేబినెట్ లో చర్చిస్తా అని చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. నిజంగా చంద్రబాబు వేసవి కాలం తాగునీటి సమస్య లేదా ఇతర అంశాలపై ఏమైనా చర్యలు తీసుకోవాలని అనుకుంటే ఆ సమాచారం సీఎస్ కు పంపి తగు చర్యలు తీసుకోమని కోరవచ్చు. దాన్ని ఎవరూ ఆక్షేపించరు. కానీ చంద్రబాబు అవేమీ చెప్పకుండా..ఏజెండా లేకుండా మంత్రివర్గ సమావేశం తలపెట్టడంతో తీవ్ర విమర్శల పాలు అవ్వాల్సి వస్తోంది. రేపు ఎన్నికల్లో గెలిచినా..ఓడినా ఈ తీరు మాత్రం ఆయన కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోతుందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

ఈ మధ్యే ‘నేను పోలవరం సమీక్ష చేయకపోతే ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాదు. ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుంది. పెరిగే వ్యయాన్ని ఎవరు భరిస్తారు?’ అంటూ సీఈసీకి లేఖ రాశారు. చివరకు చంద్రబాబు పోలవరం పర్యటనకు జిల్లా కలెక్టర్ డుమ్మా కొట్టారు. ఎప్పుడూ చంద్రబాబు వెంట ఉండే నీటిపారుదల శాఖ కార్యదర్శి కూడా వ్యక్తిగత కారణాలు చెప్పి ముఖం చాటేశారు. సైట్ లో ఉండే ఇంజనీర్లతోనే మమ అన్పించుకుని వచ్చేశారు. తాను సమీక్షించకపోతే ఆగిపోతుందని చెప్పిన ఆయనే.. ఈ సీజన్ కాదు..2020కే నీళ్లు అని తాపీగా ప్రకటించారు. ఈ లెక్కన పోలవరం సమీక్ష అర్జెన్సీ ఎక్కడుంది?. నిజంగా చంద్రబాబుకు పోలవరం పూర్తిపై అంత శ్రద్ధ ఉంటే వారం వారం సమీక్షించే ఆయనకు ఎన్నికల సమయంలో ఏమేమి పనులు పూర్తి చేయాలో..అధికారులు..ఇంజనీర్లకు నిర్దేశిత లక్ష్యాలు అప్పగించలేరా?. అలా ఎందుకు అప్పగించలేదు?. కోడ్ రాక ముందే ప్లాన్ చేసుకుని ఉంటే అసలు ఈ సమస్యలే ఉండేవి కాదు కాదా?. వారం వారం సమీక్ష చేసిన చంద్రబాబుకు ఈ మాత్రం తెలియదని ఎవరైనా అనుకుంటారా?. అటు పోలవరం వ్యవహారం అయినా..ఇటు మంత్రివర్గ సమావేశం అయినా అన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న రాజకీయ రగడే అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

 

 

Similar News