కలకలం. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బయటకు పొక్కిన వార్తతో అందరూ ఉలిక్కిపడ్డారు. ముందు వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే వార్తలు వచ్చాయి. కొద్దిసేపటికే ఇది సహజ మరణం కాదు...హత్య అని తేలటంతో ఒక్కసారిగా అంతా అవాక్కు అయ్యారు. అత్యంత కీలకమైన ఎన్నికల ముందు జరిగిన హత్య వెనక ఎవరున్నారు?. మృదుస్వభావి అయిన వివేకానందరెడ్డిని హత్య చేయించే అంత వ్యతిరేకులు ఉన్నారా?. అదీ అంత దారుణంగా హింసించి మరీ హత్య చేయటం వెనక కారణాలేంటి?. ఇప్పుడు అందరి మదిలో ఇవే ప్రశ్నలు. ఎన్నికల సమయం కావటంతో దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అయితే నిజాలు ఎప్పటికి వెలుగులోకి వస్తాయనేది ఎవరికీ తెలియదు. ఎప్పుడూ లేని రీతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యంత వేగంగా స్పందించి దీనిపై ‘సిట్’ విచారణకు ఆదేశించారు. అయితే వైసీపీ తనదైన శైలిలో ఈ ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ‘సిట్’లు ఎలా పనిచేస్తున్నాయో అందరికి తెలిసిందే అంటూ దాడి ప్రారంభించింది.
వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టమ్ లో వివేకానందరెడ్డి శరీరంపై ఏడు గాయాలు ఉన్నట్లు గుర్తించారు. తలపైన,మెడపైన,చేతిపైన ,తొడపైన ఈ గాయాలు ఉన్నాయని వెల్లడైంది. ఈ నివేదిక వచ్చిన తర్వాత వివేకానందరెడ్డి హత్యకు గురైనట్లు తాము భావిస్తున్నామని పోలీస్ సూపరింటెండెంట్ రాహల్ ప్రకటించారు.వచ్చే ఎన్నికలలో ఆయన జిల్లా వ్యాప్తంగా తిరిగి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేస్తున్నారు.అంతేకాక జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్ చార్జిగా ఉన్నారు.గత రాత్రి జమ్మలమడుగు ప్రాంతంలో ప్రచారం చేసి వచ్చారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన పులివెందులలోని ఇంటికి వెళ్లారు.కాగా ఈ కేసును విచారించడానికి సిట్ వేస్తున్నామని ఎస్పీ చెప్పారు. అన్ని క్లూస్ ను తీసుకుంటున్నామని తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను కలసి సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.