ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వరస పెట్టి షాక్ లు తగులుతున్నాయి. దాసరి సోదరులిద్దరూ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఇప్పటికే దాసరి జై రమేష్ కొద్ది రోజుల క్రితం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు కూడా తన అన్న జై రమేష్ తో వచ్చి వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
వైసీపీలో చేరిన తర్వాత దాసరి బాలవర్ధన్ రావు మీడియాతో మాట్లాడుతూ... గన్నవరం నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని అన్నారు. గన్నవరంలో ప్రజల కష్టసుఖాలు చెప్పుకునే పరిస్థితి టీడీపీలో లేదని అన్నారు. కార్యకర్తల భవిష్యత్ కోసం తాను వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు. అయితే తాను ఎలాంటి హామీలు అడగలేదని దాసరి బాలవర్ధన్ రావు పేర్కొన్నారు.