తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ‘ట్రాక్ తప్పి’ మాట్లాడారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం తిరుపతి పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు ‘సంచలనం’గా మారాయి. ‘ఈ రోజు మీరు వాడే సెల్ ఫోన్లకు నేనే శ్రీకారం చుట్టా. ఈ పనికి మాలిన రాజకీయాలు వదిలిపెట్టండి. డేటా డేటా అంట. ఏం డేటానో నాకు అర్థం కావటం లేదు. 84 నుంచి ఈ దేశంలో ఐటి అంటే మారుపేరు నేనే తమ్మూళ్లూ. మీ అందరికీ తెలుసు’ అంటూ ప్రజలకు షాక్ ఇఛ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిందే 1995 సెప్టెంబర్ 1న. కానీ ఆయన మాత్రం తాను 1984 నుంచే దేశంలో ఐటికి మారుపేరుగా నిలిచానని చెప్పుకోవటం వింతల్లో కెల్ల వింత. తెలుగుదేశం పార్టీనే తన రాజకీయ అవసరాలకు ప్రజలకు చెందిన అత్యంత కీలకమైన డేటాను ఉపయోగించుకుంటూ ఆయన ఇప్పుడు తిరిగి ఎదురుదాడి ప్రారంభించారు. నిజంగానే చంద్రబాబు చెబుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఈ డేటాను వైసీపీకి ఇప్పుడు అప్పగిస్తే ఏమి చేసుకుంటుంది?. సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు ఎవరైనా ఈ డేటాను ఉపయోగించుకోగలరా?.
టీడీపీ ఈ డేటాను..ప్రభుత్వ వనరులను అడ్డగోలుగా పార్టీ అవసరాలకు వాడుకుంటూ దుర్వినియోగానికి పాల్పడుతోందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం రివర్స్ లో ఏ అంశం వచ్చినా ప్రధాని మోడీకి లింక్ పెట్టేసి మాట్లాడుతున్నారు. అసలు ప్రధాని మోడీకి దేశంలో బిజెపి గెలుపు..మిగిలిన అంశాలు ఏమీ లేకుండా కేవలం చంద్రబాబును ఓడించటం కోసమే పనిచేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. డేటా చోరీకి సంబంధించి చంద్రబాబు, నారా లోకేష్ మొదలుకుని టీడీపీ నేతల రియాక్షన్ చూస్తుంటే వీరు ఎంతగా దీన్ని దుర్వినియోగం చేశారో అర్థం అవుతుంది. ఓట్ల తొలగింపు అంశంపై నిన్న మొన్నటి వరకూ అసలు టీడీపీ మాట్లాడిందే లేదు. కానీ ఇప్పుడు సడన్ గా దీనిపై గగ్గోలు పెట్టడం స్టార్ట్ చేసింది. చూడాలి ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో.