తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇది షాక్. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ పరిణామం టీడీపీ శ్రేణులను షాక్ కు గురిచేసిందనే చెప్పొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కొరడా ఝుళిపించింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ బీ వెంకటేశ్వరరావుపై వేటు వేసింది. ఆయనపై ఇప్పటికే పలుమార్లు ప్రతిపక్ష వైసీపీ సీఈసీకి ఫిర్యాదులు చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉణ్న ఏ బీ వెంకటేశ్వరరావు అధికార టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కొద్ది రోజుల ముందే ఏపీ సర్కారుకు ఆయనకు పదోన్నతి కూడా కల్పించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఏ బీ వెంకటేశ్వరరావుకు ఎలాంటి ఎన్నికల బాధ్యతలు అప్పగించకుండా హెడ్ క్వార్టర్స్ కు సరెండర్ చేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏ బీ వెంకటేశ్వరరావుతో పాటు కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంలను కూడా హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు.