ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యంత కీలకమైన ‘పోలవరం’ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరు తీవ్ర విమర్శల పాలు అవుతోంది. ‘రాజకీయం’ కోసం చంద్రబాబు ఈ ప్రాజెక్టుతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో చంద్రబాబుకు విభేదాలు ఉండొచ్చు. అసలు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం అంచనాలను ఏపీ ప్రభుత్వం ఎలా పెంచుతుంది?. కేంద్రం ఆమోదం లేకుండా ఇష్టానుసారం పెంచితే ఆ డబ్బులు కేంద్రం ఇస్తుందా?. ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ఇప్పుడు. మొదటి నుంచి పోలవరం అంచనాలపై కేంద్రం, రాష్ట్రాల మధ్య తేడాలు ఉన్నాయి. అస్మదీయ కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు పనులు అప్పగించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రాజెక్టును ప్రమాదంలో పడేయటం ఖాయం అని చెబుతున్నారు. ఓ వైపు ప్రధాని నరేంద్రమోడీ ఏపీ బహిరంగ సభలో పోలవరం అంశాన్ని ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం 2010–11 ధరల మేరకు రూ.16,010 కోట్లు ఉండగా , ఇప్పుడు ఏకంగా రూ.55,548.87 కోట్లకు పెంచుతూ సాగునీటి శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీవో 21ని జారీ చేశారు.
పోలవరం అంచనాలకు సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం కార్యదర్శి యు.పి.సింగ్ నేతృత్వంలో సాంకేతిక సలహా కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా సెలవు రోజైనప్పటికీ ఆదివారం అంచనా వ్యయాన్ని పెంచేస్తూ జీవో 21 జారీ చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2017 ఆగస్టులో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.57,940 కోట్లకు పెంచుతూ, ఇందుకు ఆమోదం తెలపాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అప్పటి నుంచి ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. ఓ వైపు ఢిల్లీలో సమావేశం ఉన్న ఒక్క రోజు ముందు జీవో జారీ చేయటం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఈ పని చేశారని చెబుతున్నారు. కేంద్రం కాదంటే మళ్ళీ సహజంగా మోడీపై ఎటాక్ మొదలుపెట్టవచ్చు. దాన్ని ఈ ఎన్నికలకు మరింత శక్తివంతంగా వాడుకోవచ్చు. అదే అసలు ప్లాన్ కావచ్చొని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.