ప్రతిపక్షంలో ఉండగా మచిలీపట్నం పోర్టుపై తెలుగుదేశం పార్టీ పెద్ద ఉద్యమాలు చేసింది. 2008 సంవత్సరం ఏప్రిల్ లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఈ ఓడరేవుకు శంకుస్థాపన చేశారు. తొలుత మేటాస్ కు దక్కిన ఈ ఓడరేవు ప్రాజెక్టు తర్వాత నవయుగా ఇంజనీరింగ్ సంస్థకు కేటాయించారు. ఈ సంస్థకు ఇవ్వాల్సిన భూమి విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (ఐపీఏ) నివేదిక తెప్పించారు..దీనికి అనుగుణంగా పనులు ప్రారంభిస్తామని హామీ ఇఛ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ఓడరేవుకు సంబంధించి అడుగు ముందుకు పడలేదు. శంకుస్థాపన నుంచి ఇఫ్పటివరకూ నలుగురు ముఖ్యమంత్రులు వచ్చారు..కానీ పోర్టు మాత్రం నాలుగు అడుగులు ముందుకు సాగలేదు.
అతి తక్కువ భూమి చేతిలో ఉన్నా విశాఖపట్నం, గంగవరం ఓడరేవులు భారీ ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తూ దూసుకెళుతున్నాయి. కానీ నవయుగా ఇంజనీరింగ్ మాత్రం ఇప్పటివరకూ మచిలీపట్నం ఓడరేవు పనులు ప్రారంభించలేదు. అధికారంలో ఉన్న నాలుగున్నర సంవత్సరాలు మచిలీపట్నం ఓడరేవుపై దృష్టి సారించని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఈ ఓడరేవు పేరుతో మరోసారి ‘మాయ’ చేసేందుకు రంగం సిద్ధం చేశారని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. అందులో భాగంగానే చంద్రబాబు గురువారం నాడు ఈ ఓడరేవులో మళ్లీ కొత్తగా ‘పైలాన్’ ఆవిష్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే శంకుస్థాపన పూర్తి అయిన ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపన ఏంటి అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.