పంతం నెగ్గింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం జరిగింది. అయితే ఇది రహస్యంగా సాగిపోయింది. శబరిమల ఆలయంలోకి మహిళలు కూడా వెళ్లొచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటి నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తతలను అధిగమించి ఇద్దరు మహిళలు నల్లటి దుస్తులు ధరించి ఎవరికీ అనుమానం రాకుండా ఆలయంలోకి ప్రవేశించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50ఏళ్ల లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి. బుధవారం తెల్లవారు జామున 3.45 గంటల ప్రాంతంలో బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. తర్వాత ఆలయ బయటకు వచ్చి కేరింతలు కొడుతూ అయప్ప స్వామిని దర్శించుకున్నామని ఆనందంగా ప్రకటించారు.
వీరిద్దరూ అయ్యప్పను దర్శించుకున్న వీడియో కూడా బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళలుగా(50ఏళ్లలోపు) వీరు రికార్డు సృష్టించారు.శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50ఏళ్ల మహిళలు ప్రవేశించకుండా దశబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సెప్టెంబరు 28ను సుప్పీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో కేరళ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు అయ్యప్ప భక్తులు నిరసనలు చేపట్టారు. ఇటీవల కొంత మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా.. వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసులు భద్రత కల్పించినప్పటికీ భక్తులు మహిళలను ఆలయంలోకి వెళ్లనివ్వలేదు. అయితే ఈ సారి ఎలాంటి ఘర్షనలు లేకుండా నిశ్శబ్దంగా వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.