జగన్ ఒకేసారి వంద సీట్లు ప్రకటిస్తారా?!

Update: 2019-01-05 03:50 GMT

ఇదే ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ. ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఈ సారి ఒకే దఫా వంద సీట్లలో అభ్యర్ధులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రకటన కూడా అతి త్వరలోనే ఉండే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు తెలిపాయి. 175 సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి వంద సీట్లలో అభ్యర్ధులను ప్రకటించటం ద్వారా జగన్ ఎన్నికలకు ‘ముందస్తు’ ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇలా ముందుగా అభ్యర్ధుల ప్రకటన పార్టీకి లాభిస్తుందని..ప్రచారానికి కావాల్సినంత సమయం ఇచ్చినట్లు అవుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. మిగిలిన 75 సీట్లకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేయాలని..పరిస్థితులకు అనుగుణంగా ఈ సీట్లలో నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. తాజాగా పూర్తయిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ అందరి కంటే ముందుగా అభ్యర్ధుల ప్రకటన ఫార్ములాను అనుసరించి సక్సెస్ అయ్యారు.

ప్రతి చోటా ఇదే ఫార్ములా పనిచేస్తుందని చెప్పటానికి లేకపోయినా...అభ్యర్ధి ప్రజల్లోకి వెళ్ళటానికి..తమ ప్రత్యర్ధుల కంటే ముందుకు ప్రచారం చేసుకోవటానికి ఇది పనికొస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సారి వైసీపీలో టిక్కెట్ల కేటాయింపు కూడా పక్కాగా ‘గెలుపు’ అవకాశాలు ఉన్నవారికే తప్ప..ఇతర మొహమాటాలు..లాబీయింగ్ కు జగన్ ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగాలేరని చెబుతున్నారు. అయితే గతంలో చేసినట్లు కాకుండా ఏదైనా కారణంగా టిక్కెట్ నిరాకరించాల్సి వస్తే..అలాంటి నేతలతో జగన్ స్వయంగా మాట్లాడి బుజ్జగింపులు కూడా చేయటానికి ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని ఓ నేత వెల్లడించారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు తీరాలకు చేరాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు చేరింది.

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో జగన్ పాదయాత్ర జనవరి 9న ముగియనుంది. ఆ తర్వాత వారం రోజుల పాటు విశ్రాంతి కోసం జగన్ విదేశాలకు వెళ్ళనున్నారు. ఆ తర్వాత మళ్ళీ బస్సు యాత్ర చేపట్టి..పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాల్లో పర్యటనలు తలపెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను టచ్ చేయాలనేది జగన్ ప్లాన్ గా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇఛ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన రైతు రుణ మాఫీ సక్రమంగా అమలు చేయలేకపోవటం, రాజధాని నిర్మాణంలో పురోగతి ఏమీ లేకపోవటం, ఏపీలో గతంలో ఎన్నడూలేని రీతిలో సాగిన విచ్చలవిడి అవినీతి ఇవన్నీ తమకు కలసి వస్తాయనే ధీమాతో వైసీపీ వర్గాలు ఉన్నాయి.

 

 

Similar News