ఇది ఎవరో విపక్ష నేత చేసిన వ్యాఖ్యలు కావు. నిత్యం ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై జరిగే ‘కుట్ర’లను తన సత్తాతో వెలికితీసే ఒకప్పటి హీరో శివాజీ చెబుతున్న మాట. అంతే కాదు..ఇప్పుడు ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా జరుగుతున్న మరో కుట్రను కూడా వెలుగులోకి తెచ్చినట్లు చెప్పుకుంటున్నారు. చుక్కల భూముల విషయంలో కొంత మంది అధికారులు ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయటంలేదన్నారు. కోర్టులు తీర్పు చెప్పినా బాధితుల పక్షాన నిలవకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సీఎం బతిమిలాడుతున్నా కలెక్టర్లు మాట వినడం లేదన్నారు శివాజీ. ప్రజలను టార్గెట్ చేసిన అధికారుల గల్లా పట్టుకుని అడుగుతానన్నారు. అన్ని ఆధారాలను సీఎం చంద్రబాబుకు త్వరలోనే అందజేస్తానని శివాజీ తెలిపారు. కొంత మంది అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని... అంత ఇష్టముంటే రాజీనామా చేసి విపక్షపార్టీలో చేరాలన్నారు.
విపక్షానికి ప్రజాసమస్యలు పట్టవని... వారికి కావాల్సింది సీఎం కుర్చీనే అన్నారు. చుక్కల భూములపై మంత్రులను అధికారులు లెక్కచేయడం లేదని... చుక్కల భూముల సమస్య రాజకీయ ఎత్తుగడకు అవకాశంగా మారిందన్నారు. సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. గట్టిగా మాట్లాడితే భూములు లాక్కుంటామని కలెక్టర్ బెదిరిస్తున్నారని.. ఆ భూములు కలెక్టర్ అబ్బ సొత్తా అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. మరి నిజంగా శివాజీ చెప్పినట్లు అంత ధర్మబద్ధంగా ఉన్న చుక్కల భూములను లబ్దిదారులకు అనుకూలంగా కేటాయింప చేయటంలో విఫలం కావటం సర్కారు బాధ్యత అవుతుందా? లేక ప్రతిపక్ష బాధ్యత అవుతుందా?. శివాజీ చెప్పినట్లు చుక్కులు భూములు అన్నీ పక్కావే అయితే..వాటిని లబ్దిదారులకు ఇప్పించాల్సిన బాధ్యత ఎవరిది అవుతుంది?.