కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ మృతి

Update: 2019-01-29 04:37 GMT

కార్మిక నేతగా..కేంద్ర మంత్రిగా ఎన్నో సంచనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన జార్జి ఫెర్నాండెజ్ ఇక లేరు. గత కొంత కాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన మంగళవారం ఉదయం కన్ను మూశారు. ఆయన తాజాగా స్వైన్ ఫ్లూ తో ఇబ్బందిపడ్డారు. చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. జార్జి ఫెర్నాండెజ్ వయస్సు 88 సంవత్సరాలు. 1930 జూన్‌ 3న మంగుళూరులో జన్మించిన జార్జి మ్యాథ్యూ ఫెర్నాండెజ్‌ 1967లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. దివంగత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి కేబినెట్‌లో రక్షణ మంత్రిగా పనిచేసిన ఫెర్నాండెజ్‌ సమాచార శాఖ, రైల్వే, పరిశ్రమలు వంటి పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.

జనతాదళ్‌ నేతగా పేరొందిన ఫెర్నాండెజ్‌ వీపీ సింగ్‌ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా వ్యవహరించారు. మాతృసంస్ధ జనతాదళ్‌ను వీడిన అనంతరం ఆయన బీజేపీతో చేతులు కలిపారు. 1994లో సమతా పార్టీని స్ధాపించిన ఫెర్నాండెజ్‌ ఎన్డీఏలో భాగస్వామిగా బీజేపీతో కలిశారు. ఎన్డీఏలో కీలక నేతగా ఎదిగిన ఫెర్నాండెజ్‌ వాజ్‌పేయికి అత్యంత విధేయుడిగా పేరొందారు. ఫెర్నాండెజ్‌ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే కార్గిల్‌ యుద్ధం, పోఖ్రాన్‌ అణుపరీక్షలను భారత్‌ విజయవంతంగా చేపట్టింది.

Similar News