తెలంగాణ పత్రికల్లో ఆంధ్రా వార్తలు ఎందుకు?. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్య. కానీ ఇదే కెసీఆర్ ఇప్పుడు ఆంధ్రా పార్టీతో కలసి రాజకీయం చేయటం ఏమిటి?. లేక వైసీపీ తెలంగాణ పార్టీనే అని ఏమైనా కొత్త సూత్రీకరణ చేస్తారా?. తెలంగాణ వనరులను రాజశేఖర్ రెడ్డి అడ్డగోలుగా దోచుకున్నారని గతంలో తీవ్రమైన ఆరోపణలు చేసిన కెసీఆర్ ఇప్పుడు వైసీపీతో ‘ఫెడరల్ ఫ్రంట్’ దోస్తీకి తహతహలాడుతున్నారు. అసలు ఎవరైనా ‘అమరావతి’ వెళ్ళటమే మహాపాపం అన్నట్లు మాట్లాడిన కెసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం అమరావతి వెళ్లి మరీ జగన్ ను కలుస్తానని ప్రకటించటం వెనక రాజకీయ కోణం ఏమిటి?. ఇప్పటివరకూ కెసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా చేరిన దాఖలాలు లేవు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం కెసీఆర్ ప్రయత్నాలను స్వాగతించి మరింత చర్చలు చేస్తామని ప్రకటించారు.
తెలంగాణను వ్యతిరేకించిన జగన్ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేయటానికే వీల్లేదని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మానుకోటలో జగన్ పై టీఆర్ఎస్ శ్రేణులు భారీ దాడి చేశాయి. జగన్ తెలంగాణ వ్యతిరేకతను కెసీఆర్, తనపై జరిగిన దాడిని జగన్ చాలా కన్వీనెంట్ గా మర్చిపోయారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఎన్నికల సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖను ఉపసంహరించుకుని ఈ జిల్లాలో అడుగుపెట్టాలని కెసీఆర్ సవాల్ విసిరారు. మరి ఇఫ్పుడు పోలవరంతో పాటు పలు ఏపీ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ ను జగన్ కెసీఆర్ లాగా ప్రశ్నించగలరా?. తాజాగా ముగిసిన ఎన్నికల సమయంలోనే ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా కెసీఆర్ దగ్గర నుంచి కవిత వరకూ అందరూ మాట్లాడిన విషయం మర్చిపోయి...ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే కొత్త పాట అందుకున్నారు.
వైసీపీపై కెసీఆర్ తోపాటు కెటీఆర్, కవితలు గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కానీ ఇవన్నీ విస్మరించిన జగన్ ఏ మాత్రం అవసరం లేకపోయినా కూడా కెటీఆర్ అండ్ టీమ్ తో చర్చలు జరిపి అనవసర ఇబ్బందుల్లో పడాల్సి వచ్చిందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అవసరం లేని సమయంలో కూడా పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టడం జగన్ కే చెల్లిందని అన్నారు. కెసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగూ విజయం సాధించారని..ఎంపీలు కూడా ఆయనకే మెజారిటీ వచ్చే అవకాశం ఉందని..అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ చేసిన పని పార్టీని ఎటువైపు తీసుకెళుతుందో అన్న టెన్షన్ పార్టీ నేతల్లో ఉందని చెబుతున్నారు.