ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్తగా వాయిదాల స్కీమ్ మొదలుపెట్టారు. ఎలాగైనా డ్వాక్రా మహిళల ఓట్లే టార్గెట్ గా వాయిదాల పద్దతిలో వాళ్లకు దాదాపు పది వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పధకం పేరుతో ఓట్లు కొనుక్కోవటమే అని చెప్పొచ్చు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన డ్వాక్రా మహిళల రుణ మాఫీని విస్మరించి ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేశారు. అంతే కాదు..ఇంత భారీ మొత్తంలో డబ్బులు ఇస్తున్నా కాబట్టి తనకు ఓటు వేయాల్సిందేని ప్రజల సొమ్ముతో నిర్వహించిన సభలో బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ సర్కారు కేవలం పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కంటే అప్పుల బండితోనే ముందుకు నడుస్తోంది. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములు తనఖా పెట్టి పది వేల కోట్ల రూపాయల అప్పు చేయటానికి సర్కారు ఈ మధ్యే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఇలా చేసిన అప్పులు ఎన్నో. అప్పు చేస్తే తప్ప ముందుకు సాగని పరిస్థితి. ఈ దశలో డ్వాక్రా మహిళలకు ఏకంగా పది వేల కోట్ల రూపాయల సాయంతో పాటు వాళ్లకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని ఎవరు డిమాండ్ చేశారు. అసలు ఈ డబ్బుల పంపిణీకి ప్రాతిపదిక ఏమిటి? ఏ ప్రాతిపదికన అన్ని సంఘాలకు ఇలా ప్రజల డబ్బును హెరిటేజ్ సంపదలాగా ఎలా పంచిపెడతారు?.
ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకానికి అయనా ఓ ప్రాతిపదిక..ఓ లెక్క ఉండాలి.
అంతే కానీ..ఎన్నికల్లో గెలవటానికి అప్పులు చేసిన డబ్బును అలా పంచేస్తానంటే సరిపోతుందా?. ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిన వారంతా అర్హులైనా?. కేవలం ఎన్నికల్లో గెలుపు ముఖ్యం కాబట్టి ఇవన్నీ మనకేం సంబంధం నిధులు పంచేద్దాం..గెలిచేద్దాం అన్నదే ప్రాతిపదికనా?. గతంలో ఏ పథకంలో లేని రీతిలో సర్కారు డ్వాక్రా మహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తుందట. ఇలా చేయటం ఇదే మొదటిసారి. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండటంతో ముందస్తుగానే ఈ ఏర్పాట్లు చేస్తున్నారన్న మాట.
తొలుత పదివేలు ఇస్తామని ప్రకటించి..ఇప్పడు ఫిబ్రవరిలో డ్వాక్రామహిళలకు మూడు చెక్కులు ఇవ్వబోతున్నారు. వీటిలో ఒక చెక్కు ఫిబ్రవరికి సంబంధించి రూ. 2500, మార్చినెలకు సంబంధించి రూ.3500, ఏప్రిల్ నెలకు సంబంధించి రూ. 4000 పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తామని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు సర్కారు 14200 కోట్ల రుణమాఫీకిప్రభుత్వం ఎగనామం పెట్టిన విషయం తెలిసిందే.