ఎవరైనా చేసింది చెప్పుకుంటారు?. మళ్లీ వస్తే ఏమి చేస్తారో చెబుతారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి పరిస్థితి మాత్రం వింతగా ఉంది. ఆయన తన ‘బొమ్మల విజయాల’ను కూడా ప్రచారానికి వాడేసుకుంటున్నారు. అమరావతిలో శాశ్వత రాజధానికి సంబంధించి పనులు ఇప్పుడే మొదలయ్యాయి. అవి కూడా ముఖ్యంగా సచివాలయానికి సంబంధించే. ఇంకా అసెంబ్లీ, రాజ్ భవన్, శాశ్వత హైకోర్టు పనులు ఏమీ ప్రారంభమే కాలేదు. కానీ ప్రచారంలో ‘గిన్నిస్ రికార్డు’ సాధించగల చంద్రబాబు ఈ బొమ్మలతో ప్రచారం చేసుకుంటున్నారు. అమరావతిలో ఇప్పటికే ఐదు టవర్ల సచివాలయం, అసెంబ్లీతో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయని.. అమరావతి సింగపూర్ మారిందన్నట్లు టీవీ యాడ్స్ లో ప్రకటనలు కుమ్మేస్తున్నారు. ఇవి చూసిన అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. చేసిన పనులు..కట్టిన నిర్మాణాల గురించి చెప్పుకోవచ్చు కానీ..అసలు ఉనికిలోనే లేని భవనాలతో ప్రచారం ఏంటి? అంటూ అవాక్కు అవుతున్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు సాగిస్తున్న ‘దోపిడీ’ దేశ చరిత్రలోనే ఓ రికార్డుగా మారే అవకాశం ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
ప్రపంచ శ్రేణి రాజధాని పేరుతో ఏపీ ప్రజలను వంచిస్తూ భారీ దోపిడీకి తెగబడుతున్నారు. రైతుల దగ్గర నుంచి సేకరించిన భూములను ఓ వైపు అస్మదీయ సంస్థలకు ఎడా పెడా అప్పగిస్తూ కోట్ల రూపాయలు దండుకోవటంతో పాటు..కాంట్రాక్ట్ ల కేటాయింపులోనూ ఇదే దందా కొనసాగిస్తున్నారు. చివరకు పచ్చటి మొక్కల కొనుగోలులోనూ అవినీతి. ఇక సింగపూర్ సంస్థలే రాజధాని కడతాయని నమ్మించి చేసిన మోసం అయితే చంద్రబాబు జమానాలో ఓ అతి పెద్ద రికార్డ్ గా నిలబడబోతోంది. ఏపీ ప్రభుత్వం ఎంత దోచిపెట్టడానికి రెడీ అయినా కూడా సింగపూర్ సంస్థలు చంద్రబాబుపై నమ్మకం లేక ఇప్పటి వరకూ అసలు పనులు మొదలుపెట్టలేదు.
మళ్ళీ గెలిస్తే ఆ ఐదేళ్ళలో అందినంత దోచుకుని వెళ్ళాలనేది ఆ సంస్థలు, చంద్రాబు ఉమ్మడి ప్లాన్. లేదంటే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అటకెక్కటం ఖాయం అని మౌలికసదుపాయాల శాఖ వర్గాలే అంచనా వేస్తున్నాయి. లోపల ఎంత దోపిడీ జరిగినా చంద్రబాబు ఒకట్రెండు అద్భుతమైన భవనాలు నిర్మించటం ద్వారా ఈ స్కాంలను మరుగున పడేలా చేయటంలో దిట్ట అని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం అమరావతిలో నిర్మాణాలు అద్భుతం..భేష్ అంటూ అస్మదీయ మీడియాలో కథనాలు రాయించుకుంటూ ప్రచారం ఊదరగొట్టిస్తున్నారు. ఉద్యోగులకు ఇళ్లు కట్టడం కూడా ఓ విజయమేనా?.