జగన్ కేసు ఎన్ఐఏకి అప్పగింత

Update: 2019-01-04 05:34 GMT

విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును ఏపీ హైకోర్టు కేంద్రం పరిధిలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఏఐ)కి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. ఏపీ సర్కారు మొదట నుంచి ఈ దాడి వెనక ఎలాంటి కుట్ర లేదని..కేవలం జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు ప్రచారం కోసం...సంచలనం కోసమే ఈ దాడి చేశారంటూ చెబుతూ వస్తోంది. ఈ తరుణంలో ఏపీ హైకోర్టు వెలువరించిన తీర్పు ఏపీ సర్కారును ఇరకాటంలోకి నెట్టినట్లు అయింది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విమానాశ్రయంలో అయినందున ఈ కేసు విచారణ కూడా కేంద్ర విచారణ సంస్థలే చేపట్టాలని వైసీపీ కోరుతోంది.

ఈ మేరకు హైకోర్టును జగన్ తరపున లాయర్లు కోర్టును ఆశ్రయించారు. ఏపీ పోలీసుల తీరుపై వైసీపీ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇదే కారణంతో పోలీలసుకు జగన్ వాంగ్మూలం కూడా ఇవ్వలేదు. అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే అగంతుకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై దాడి వెనక కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిబంధనలు అన్నీ స్పష్టంగా ఉన్నందున ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించినట్లు న్యాయవాదులు తెలిపారు. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించాల్సిన అవసరం లేదంటూ వాదించిన ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు షాక్ గా మారాయి.

 

 

Similar News