వైజాగ్ నుంచి బ్యాంకాక్ కు విమాన సర్వీసులు

Update: 2018-12-07 08:52 GMT

ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నెల 4వ తేదీ నుంచి విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్ కు విమాన సర్వీసులు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం వయబులిటి గ్యాఫ్ ఫండ్ (వీజీఎఫ్) కింద నిధులు సమకూర్చుతూ ఇండిగో ద్వారా ఈ సర్వీసులు ప్రారంభింపచేసింది. దీంతో విజయవాడ విమానాశ్రయం నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం అయినట్లు అయింది. ఇప్పడు వైజాగ్ నుంచి బ్యాంకాక్ కు విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్నాయి. శుక్రవారం నుంచే ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే వైజాగ్ నుంచి దుబాయ్, సింపూర్, మలేషియాకు సర్వీసులు నడుస్తున్నాయి.

వారంలో నాలుగు రోజులు విశాఖ నుంచి బ్యాంకాక్ కు విమాన సర్వీసులు నడవనున్నాయి. సోమ, మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ఉంటుంది. వారంలో నాలుగు రోజుల పాటు థాయ్‌ ఎయిర్‌ ఏసియా తమ సర్వీసులను బ్యాంకాక్‌కు నడపనుంది. ఏడో తేదీ రాత్రి బ్యాంకాక్‌లోని డాన్‌ముయాంగ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి 11.45 గంటలకు విశాఖ చేరుతుంది. 30 నిమిషాల అనంతరం శుక్రవారం అర్ధరాత్రి దాటాక 12.15 గంటలకు బ్యాంకాక్‌కు తొలి విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. విశాఖపట్నం-బ్యాంకాక్‌ల మధ్య ప్రయాణ సమయం దాదాపు మూడు గంటలు మాత్రమే. టిక్కెట్టు ధర డిమాండ్‌ను బట్టి రానూపోనూ రూ.6,000–14,000 మధ్య ఉంది.

 

Similar News