ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. హోదా బదులే ప్రత్యేక ప్యాకేజీ ఇఛ్చేశామని తేల్చిచెప్పింది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించింది. ఇప్పుడు ఇక ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని తేల్చిచెప్పింది. ప్యాకేజీ కింద విదేశీ సంస్థల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం ఓ వైపు ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని పార్లమెంట్ సాక్షిగా చెబుతుంటే తెలుగుదేశం పార్టీ, వైసీపీ సభ్యులు పార్లమెంట్ లో ఇదే అంశంపై ఆందోళన చేస్తున్నారు.
వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పార్లమెంట్ వెలుపల నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీలు కూడా ప్రత్యేక హోదాతోపాటు విభజన అంశాలు అన్నింటిని అమలు చేయాలని కోరుతూ గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేక హోదా కోసం ఒక్క రోజు దీక్షకు దిగారు. పార్లమెంట్ లో మంగళవారం నాడు రాఫెల్ డీల్, సిక్కు ఊచకోతల అంశం ప్రకంపనలు రేపింది.