వైసీపీ, జనసేనలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెబుతున్న టీఆర్ఎస్ గెలిస్తే వైసీపీ, జనసేనలు సంబరాలు చేసుకుంటాయా? అని ధ్వజమెత్తారు. వీళ్లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ వీరందరితో నాటకాలాడిస్తున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవన్, జగన్, కేసీఆర్‌ను మనపై ఎగదోస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీని ఎదుర్కోవడానికి అన్ని రాజకీయపార్టీలను ఒకటి చేశామని, మూడు రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిందంటే టీడీపీ కృషి కూడా ఉందని ఆయన అన్నారు. టీడీపీ పుట్టింది తెలంగాణలోనే అని.. కేసీఆర్ కూడా టీడీపీ పార్టీలో ఉన్నవారేనని చంద్రబాబు అన్నారు. ఆయన తనకు బర్త్ డే గిఫ్ట్ తిరిగి ఇస్తానంటున్నారని.. ఇది న్యాయమా? అని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అప్పుడు కేసీఆర్ హోదా ఇవ్వాలన్నారని, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. సీబీఐ అవినీతిలో కూరుకుపోయిందని, ప్రధానినే ఓ అవినీతిపరుడిని ప్రోత్సహిస్తున్నారని బాబు విమర్శించారు. ఒత్తిళ్లు తట్టుకోలేక ఆర్ భిఐ గవర్నర్ రాజీనామా చేశారని, ఈడీ, ఐటీని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యర్థులపై దాడులకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, అందుకే అన్ని రాజకీయపార్టీలతో బీజేపీ వ్యతిరేక కూటమికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు స్పష్టం చేశారు.కెసీఆర్ గెలుపును స్వాగతిస్తూ ఏపీలో వైసీపీ, జనసేన నేతలు చేస్తున్న హంగామాపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ ప్రయోజనాల కంటే మీకు కెసీఆర్ గెలుపు ఆనందమా? బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.