సినిమాల్లో పృథ్వీ థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ. రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ప్రధాని మోడీ కంటే నేనే ముందు సీఎం అయ్యా. ఆయన కంటే నేనే సీనియర్ ను. ఇలా తనకు తాను స్వయంప్రకటిత దేశ సీనియర్ నేతగా చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రాజకీయాల్లో ఎంతో జూనియర్ అయిన రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్ళి భేటీ అవటం ఏంటి?. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ అప్పట్లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించారు.. ఆ తర్వాతే ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అదీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఎన్టీఆర్ అప్పట్లో తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పోరాడితే ఇప్పుడు చంద్రబాబునాయుడు అదే ఫ్యామిలీకి చెందిన యువ నాయకుడు రాహుల్ గాంధీ ముందు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడానికి రెడీ అయ్యారని సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు. ఏపీ ప్రజలకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ.
విభజన తర్వాత ఏపీకి వచ్చిన రాహుల్ గాంధీపై చంద్రబాబు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. విభజన నిర్ణయం వెలువడిన తర్వాత సోనియాగాంధీపై చంద్రబాబు చేసిన శివాలేంటో అందరూ చూశారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు. చంద్రబాబు అవసరమే ఆంధ్రప్రదేశ్ అవసరం. దేశ అవసరం. ఎందుకంటే వాటిని ఆయన అలా మలచుకుని..అందరు కూడా అలాగే అనుకోవాలని కోరుకుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరు ఎవరితో అయినా కలవొచ్చు. కానీ ఎన్టీఆర్ ఏ ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టారో..ఇప్పుడు చంద్రబాబునాయుడు ఆత్మగౌరవం కోసమే రాహుల్ గాంధీని కలుస్తున్నానని చెప్పటం చూసి టీడీపీ సీనియర్లు అందరూ అవాక్కవుతున్నారు. తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు దేన్ని అయినా ఎలాగైనా మార్చుకోగలరు?. సరైన ప్రత్యర్దులు లేనంత కాలం చంద్రబాబు అలా అందరి ‘ఆత్మ గౌరవాల’తోనూ ఆడుకోగలరు.