ఏ కులం, ఏ ప్రాంతం, ఏ మతంలో పుట్టాలో మన చేతుల్లో లేదని, భగవంతుడు ఆ అవకాశం కల్పిస్తే తాను మాత్రం రెల్లి కులంలో పుట్టాలని కోరుకుంటానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. అందరూ మతాలను స్వీకరిస్తారు.. నేను మాత్రం ఇవాళ రెల్లి కులాన్ని స్వీకరించానన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నత కులం ఏదైనా ఉందంటే అది రెల్లి కులమేనన్నారు. చప్పట్లు కొట్టించుకోవడానికి ఈ మాట చెప్పడం లేదని, మనసు బరువెక్కి, కన్నీళ్లతో చెబుతున్నానని అన్నారు. సోమవారం కాకినాడలోని జీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు ముందు పారిశుధ్య కార్మికులు కన్నీటితో తమ సమస్యలను విన్నవించారు. తమకు ఇళ్లు అద్దెకు ఇవ్వడం లేదని, ఇప్పటికీ అంటరానివాళ్లలా చూస్తున్నారని, ఇళ్లు లేక ఊరి బయట పూరి గుడిసెల్లో బతుకుతూ రోగాల బారిన పడి చస్తున్నామని కన్నీరు పెట్టారు. ప్రతి కార్మికునికి పక్కా ఇళ్లు ఏర్పాటు చేయాలని , 279 జీవో రద్దు, ఒప్పంద, పొరుగుసేవల పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే కార్మికులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యలు విన్న తర్వాత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. "పారిశుద్ధ్య కార్మికులు పరిసరాలను శుభ్రం చేసినట్టే నేను రాజకీయాల్లో చెత్తను శుభ్రం చేయడానికి వచ్చాను. అందుకే పార్టీ పెట్టాను. మానవసేవే పరమావధిగా, చెత్తను శుభ్రం పరిచే మీ జీవితాల్లో వెలుగులు నింపకపోతే జాతికి ద్రోహం చేసిన వాళ్లం అవుతాము. ఒక రెల్లి చెల్లి చెప్పినట్లు- భగవంతుడు మూడు రూపాల్లో ఉంటాడు. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడి రూపంలో, అన్నంపెట్టే రైతు రూపంలో, చెత్తను శుభ్రం చేసి పారిశుద్ధ్య కార్మికుల రూపాల్లో ఉంటాడు. దశాబ్ధాలు పోరాటం చేసే నాయకుల కంటే కష్టాన్ని అనుభవించే పారిశుద్ధ్య కార్మికులు గొంతు నుంచి వచ్చే మాటలు హృదయాన్ని కదిలిస్తాయి, కన్నీళ్లు తెప్పిస్తాయి. నేను ఆశయాలను ఆచరిస్తాను, పాటిస్తాను తప్ప మాట్లాడను అని వ్యాఖ్యానించారు. మనసుల్లో ఉన్న చెత్తను శుభ్రం చేయకుండా, బయట చెత్తను శుభ్రం చేస్తే ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించారు.