ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖలో మెఘా ఇంజనీరింగ్ రాజ్యం నడుస్తోందా.? అంటే అవుననే చెబుతున్నాయి అధికార వర్గాలు. ఎందుకంటే ఒక్క సాగునీటి శాఖలోనే ఏకంగా మెఘా ఇంజనీరింగ్ సంస్థకు దాదాపు పది వేల కోట్ల రూపాయల పనులు కేటాయించటం అధికార వర్గాల్లో పెద్ద కలకలం రేపుతోంది. అసలు దేశంలో..రాష్ట్రంలో వేరే కంపెనీలే లేవా?. సాగునీటి శాఖలో కీలక ప్రాజెక్టులన్నీ ఈ ఒక్క సంస్థకే ఎందుకు వెళుతున్నాయి. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో మెఘా ఇంజనీరింగ్ సంస్థకు ఏపీ ప్రభుత్వం మొత్తం 9412 కోట్ల రూపాయల పనులు కేటాయించింది. ఈ పరిణామంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఏదైనా విచారణ వస్తే చిక్కులు తప్పవనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంత మంది అధికారులు. చాలా వరకూ మెఘా కంపెనీకి అనుగుణంగా ‘డిజైన్’ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏపీ సాగునీటి శాఖలో మెఘా ఇంజనీరింగ్ దక్కించుకున్న ప్రాజెక్టుల వివరాలు ఇవి.
పురుషోత్తపట్నం (1578 కోట్లు), కొండవీటి వాగు లిఫ్ట్ (238 కోట్లు), పట్టిసీమ (1667 కోట్లు), హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు (312 కోట్లు), ఉరవకొండ సీఎల్ డీపీ స్కీమ్ (809 కోట్లు), అడవిపల్లి లిఫ్ట్ (269 కోట్లు), చింతలపూడి లిఫ్ట్ ప్యాకేజీ 3 (690 కోట్లు), ఆలూరుపాడు లిఫ్ట్ (107 కోట్లు), బిటిపి లిఫ్ట్ (289 కోట్లు), ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్యాకేజీ 2 (878 కోట్లు) వెలిగొండ టన్నెల్ -1(292 కోట్లు), గోదావరి -పెన్నా ప్యాకేజీ (2283 కోట్లు). ఈ గోదావరి-పెన్నా ప్యాకేజీ పనులు ఒకట్రెండు రోజుల్లోనే అప్పగించనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ దాదాపు పది వేల కోట్ల రూపాయల ఉండటం విశేషం.
మెఘా రాజ్యం విస్తరణ ఇక్కడితోనే అయిపోయిందనుకుంటే పొరపాటే. అక్రమాలకు అడ్డాగా మారిన సర్వాశిక్షా అభియాన్ లోనూ మెఘాకు రెండు జిల్లాల్లో సుమారు 800 కోట్ల రూపాయల మేర పనులు దక్కాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు రాజధాని అమరావతిలోనూ ఈ సంస్థకు భారీ ఎత్తున పనులు కేటాయించారు. వివిధ శాఖల కింద దక్కిన పనులు అన్నీ కలుపుకుంటే ఈ మొత్తం 12 వేల కోట్ల రూపాయలపైనే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ సర్కారుతో ఈ ‘మెఘా’ను బంధం ఏమిటో అందరికీ తెలిసిందే.