జగన్ పై దాడి కేసు.. ఏపీ, తెలంగాణ డీజీపీలకు హైకోర్టు నోటీసులు

Update: 2018-11-13 08:34 GMT

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం. ఈ కేసులో ఏపీ, తెలంగాణ డీజీపీలతో పాటు కేంద్ర హోం శాఖకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీ అయ్యాయి. జగన్ పై దాడి జరిగిన గంటల వ్యవధిలోనే ఈ దాడి చేసింది జగన్ అభిమానే అని..ప్రజల్లో సానుభూతి పొందేందుకే ఇలా చేశారని చంద్రబాబు మీడియా సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇది పెద్ద దుమారం సృష్టించింది. ఏపీ డీజీపీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తనపై జరిగిన దాడిని స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు పలువురికి నోటీసులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు వారాల్లోగా తమ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సిట్‌ ఇన్‌చార్జ్‌ గా ఉన్న ఏసీపీ బీవీఎస్‌ నాగేశ్వరరావు, మరికొంతమంది అధికారులు మంగళవారం కేసు వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఉన్నత న్యాయస్థానానికి సమర్పించారు.

ఈ సందర్భంగా సీసీ టీవీ ఫుటేజ్‌ వివరాలను ఏమయ్యాయని ధర్మాసనం అధికారులను ప్రశ్నించింది. గత మూడు నెలలుగా సీసీ టీవీ ఫుటేజ్‌ లేదని అధికారులు తెలపడంతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీసీటీవీ పర్యవేక్షణ ఎవరి ఆధీనంలో ఉందనే విషయంపై సిట్‌ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ భద్రతా లోపాలు క్షమించారానివని ధర్మాసనం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యాయత్నం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆర్‌పీ ఠాకుర్‌ వ్యాఖ్యలను వైఎస్‌ జగన్ తరుపు న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సినీ హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంశాన్ని కూడా వివరించారు. జగన్ తరపున లాయర్ ఏపీ సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ లు కేసును తప్పుదారి పట్టించేలా వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

 

 

Similar News