పెట్టుబడులకు...ఐటి దాడులకు లింక్ ఏంటి?. ఐటి దాడులు జరిగితే పెట్టుబడులు రావా?. అంటే ఈ లెక్కన ఎవరు కోట్లాది రూపాయలు పన్ను ఎగొట్టినా ఐటి శాఖ పట్టించుకోకూడదు అని బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న నారా లోకేష్ కోరుకుంటున్నారా?. కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన లెక్కలు అన్నీ పక్కాగా ఉంటే ఉంటే..ఆదాయ పన్నులు సరిగా చెల్లించి ఉంటే ఐటి శాఖ ఏమి చేయగలదు?. ఐటి దాడులు జరిగితే పెట్టుబడులు పెట్టే వారు ఎందుకు భయపడతారు?. ఎవరైనా బాధిత వ్యక్తులు, కంపెనీలు తమను ఐటి శాఖ వేధిస్తుందని అని చెపితే ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఐటి దాడులకు ఇంతగా ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారు. ఐటి దాడులు ఎదుర్కొన్నకంపెనీలు ఏవీ కూడా ఇంత వరకూ ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా
చేయలేదు. కానీ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐటి టీమ్ లకు పోలీసు భద్రత ఉపసంహరింపచేస్తామంటూ ప్రకటించి ప్రభుత్వ వర్గాలను నివ్వెరపోయేలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటి సిబ్బందికి పోలీసు భద్రత ఉపసంహరిస్తే ఏమి అవుతుంది?. కేంద్ర బలగాలతో ఐటి శాఖ తన దాడులు కొనసాగిస్తుంది. ఐటి శాఖ ఎక్కడైనా పక్కా ఆధారాలు ఉన్నప్పుడే దాడులు చేస్తుంది. నిజంగా ఆయా కంపెనీల్లో ఎలాంటి ఉల్లంఘనలకు లేకపోతే చేయగలిగేది ఏమీ లేదు. అలాంటిది ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ఐటి దాడులపై సీరియస్ అవుతున్న తీరు చూస్తుంటే ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ఎక్కడ తమ అవినీతి సొమ్ము, బినామీల సొమ్ము భయపడుతుందో అన్న భయంతోనే వీరు ఆందోళన చెందుతున్నట్లు కన్పిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. వరస ఐటి దాడులు జరిగే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని లోకేష్ చాలా సీరియస్ గా ప్రశ్నిస్తున్నారు. అంటే ఏపీలో ప్రభుత్వ పెద్దలు..అధికారులు..కంపెనీలు ఎంత పెద్ద మొత్తంలో పన్నులు ఎగొట్టినా..అక్రమార్జనకు పాల్పడినా ఐటి దాడులు చేయకూడదా?. దీని కోసం అసెంబ్లీలో ఓ ప్రత్యేక చట్టం తెచ్చుకోండి. అప్పుడు ఏమైనా అలాంటి అవకాశం వస్తుందేమో పరిశీలించండి. అప్పటివరకూ అక్రమార్కులపై ఐటి దాడులు జరుగుతూనే ఉంటాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఐటి దాడి జరిగినప్పుడు ఏమైంది. నా దగ్గర ఏమీ లేవు..మీకు చేతనైంది చేసుకోండి అని సవాల్ విసిరినంత పనిచేశారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,మంత్రి నారా లోకేష్ ల్లో రేవంత్ రెడ్డికి ఉన్న ధైర్యం కూడా లేకపోవటం వెనక కారణం ఏంటి?. ఐటి దాడులు జరిగితే తాము అడ్డంగా బుక్కవుతామని భయపడుతున్నారా?. అందుకే పెట్టుబడులు.. కంపెనీలు అంటూ కహానీలు చెబుతున్నారా? . అవును..అదే నిజం అన్పిస్తోంది.