తెలుగుదేశం నేతలకు ఒకప్పుడు నవయుగా ఇన్ ఫ్రా జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీగా కనపడింది. పార్టీ వేదికలపై నుంచి ఇవే విమర్శలు చేశారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒకప్పుడు తీవ్ర విమర్శలు చేసిన కంపెనీనే ఇప్పుడు అస్మదీయ కంపెనీగా మారిపోయింది. అంతే కాదు..ఏకంగా ‘లాభాపేక్ష లేని సంస్థ’కు ఈ పరిస్థితా? అంటూ చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారట. అలా అని పత్రికల్లో వార్తలు వచ్చాయి. నవయుగా సంస్థకు ఏపీలో వేలాది కోట్ల రూపాయల పనులను చంద్రబాబు అడ్డగోలుగా కేటాయిస్తూ వెళుతున్నారు. ఏ పనులైనా నవయుగా, మెగా సంస్థలకే అన్న రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అలాంటి నవయుగా సంస్థపై ఐటి దాడులు జరిగితే చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నవయుగా సంస్థకు వైఎస్ హయాంలో కృష్ణపట్నం పోర్టు వద్ద సెజ్ కు కేటాయించిన వేలాది ఎకరాల్లో ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్టు అమలు చేయకపోయినా సర్కారు చోద్యం చూస్తూ కూర్చుంది.
కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నే ఈ భూ కేటాయింపులు రద్దు చేయాలని సిఫారసు చేయగా..ఇప్పటివరకూ సర్కారు ఆ ఫైలును పక్కన పెట్టింది. అంతే కాదు...ఈ సంస్థకు మరింత మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటూ సాయం చేసి పెడుతోంది. ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలాంటి ప్రకటనలు చేయటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. ప్రతి పనిలోనూ అడ్డగోలుగా అంచనాలు పెంచుతూ అస్మదీయ సంస్థలకు ప్రభుత్వం మేలు చేసి పెడుతుంది. కానీ ప్రతి విషయాన్ని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.