ఓ ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం పెట్టడం కోసమే ఢిల్లీ వెళ్ళిన ఘటన ఉంటుందా?. బహుశా ఇంత వరకూ అలాంటి అరుదైన ఘటన జరిగి ఉండదు. కానీ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పేరిట ఆ ‘రికార్డు’ నమోదు కానుంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా విలేకరుల సమావేశం పెట్టడం కోసం శనివారం నాడు ఢిల్లీ వెళుతున్నారు. ఈ పరిణామంపై అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో వరస పెట్టి జరుగుతున్న ఐటి దాడులను కూడా ఏపీపై దాడిగా సీఎం చంద్రబాబు చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో విలేకరుల సమావేశం తర్వాత అందుబాటులో ఉన్న జాతీయ పార్టీ నేతలతో సమావేశం అవుతారని చెబుతున్నా...ప్రధాన ఏజెండా విలేకరుల సమావేశమే?. కేంద్రంలోని బిజెపికి ఎలాంటి ఆలోచన ఉందో ఏమో తెలియదు కానీ....జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి జరిగిన సంఘటనను ఆసరా చేసుకుని ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టడానికి కుట్ర చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు అదే కుట్ర సిద్ధాంతాన్ని జాతీయ స్థాయిలో విన్పించటానికి రెడీ అయిపోయారు. తానూ, ఏపీ డీజీపీ సకాలంలో స్పందించి ఉండకపోతే ఘోరాలు జరిగిపోయేవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ అధికార, అనధికార వర్గాల్లో మాత్రం డీజీపీ తీవ్ర విమర్శల పాలు అవుతున్నారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అది అభిమాని దాడిగా తేల్చేయటంతో ప్రభుత్వ వర్గాలు కూడా విస్మయానికి గురయ్యాయి. డీజీపీ స్థాయి అధికారి ఎవరైనా విచారణ జరుగుతుంది..త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెబుతారని..కానీ అందుకు భిన్నంగా ఠాకూర్ రెండు గంటల్లోనే కేసు తేల్చేయటం ఏమిటని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.