స్కామ్ లు..దోపిడీ స్కీమ్ లు ఏజెండా కాకూడదనే చంద్రబాబు ప్లాన్!

Update: 2018-10-29 04:37 GMT

ఆంధ్రప్రదేశ్ ఫోకస్ గా ఎన్నికలు జరిగితే కట్టని అమరావతి ఓ ఏజెండా అవుతుంది?. ఏపీ సాగునీటి శాఖలో స్కామ్ లు కీలకం అవుతాయి. విద్యుత్ శాఖలో కుంభకోణాలు చర్చనీయాంశం అవుతాయి. రాజధాని పేరుతో సింగపూర్ కంపెనీల స్విస్ ఛాలెంజ్ దోపిడీ ఓ ప్రాధాన్య అంశంగా మారుతుంది. నీరు-చెట్టు అవినీతి పెద్ద అంశం అవుతుంది. ఇంకా పూర్తిగా అమలు చేయని రుణ మాఫీ ప్రస్తావనకు వస్తుంది. ఐటి శాఖలో అక్రమాలు. ప్రతి శాఖలో..ప్రతి స్కీమ్ లో జరిగిన స్కామ్ ల పైనే విమర్శలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నాలుగున్నర సంవత్సరాల చంద్రబాబు పాలనలో అవినీతి ‘హద్దులు’ దాటి పోయింది. అదే ఏపీ ఎన్నికల ‘ఏజెండా’ను చంద్రబాబు సెట్ చేసుకుంటే అంతా ఢిల్లీ వైపే వెళుతుంది. రాజధానికి మోడీ అన్యాయం చేశారు. పోలవరానికి నిధులు ఇవ్వలేదు. ఐటి దాడులతో రాష్ట్రంపై దాడి చేస్తున్నారు. నాపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. ప్రధాని మోడీతో జగన్, పవన్, ఇంకా తనకు వ్యతిరేకంగా ఉన్న వారంతా కలసి పోయారనే ఒకే ఒక్క ఆరోపణతో బండి నడిపేయవచ్చు.

చంద్రబాబు చెప్పింది చెప్పినట్లు..కావాలంటే ఇంకా కాస్త ఎక్కువ చేసి కూడా రాసి, చూపే అస్మదీయ మీడియా ఎలాగూ ఉండనే ఉంది. మోడీ, అమిత్ షా, బిజెపిలతో చంద్రబాబు రాజకీయంగా విభేదించవచ్చు. అది ఆయన ఇష్టమే. కానీ నాలుగు సంవత్సరాల పాటు ‘మిత్రపక్షం’గా కొనసాగి..ఇప్పుడే తనకు మోడీ, అమిత్ షాల వైఖరి అర్థం అయిందని..తాను వాళ్లను నమ్మితే మోసం చేశారని చంద్రబాబు చెపితే ఎవరైనా నమ్ముతారా?. పైగా దేశంలో అత్యంత సీనియర్ రాజకీయవేత్త అయిన చంద్రబాబు అంత తేలిగ్గా మోసపోతారా?. అదీ తనకంటే ఎంతో జూనియర్ అయిన మోడీ చేతిలో?. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ప్రధాని పదవికి పోటీపడుతున్నారా? లేక ముఖ్యమంత్రి పదవికా? అన్న అనుమానం వచ్చేలా చంద్రబాబు తన ‘ఏజెండా’ను ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇలా చేయటం ద్వారా స్థానిక అంశాలను పక్కన పెట్టి..దేశంలోనే తానొక్కడినే మోడీ ఢీకొన్న నేతగా ప్రచారం పొందటం ద్వారా గట్టెక్కాలన్నది ఆయన వ్యూహం. వర్కవుట్ అవుతుందా?. వేచిచూడాల్సిందే. పైగా ఇప్పుడు ధర్మపోరాట దీక్షలు దేశ వ్యాప్తంగా చేస్తారట!.

 

 

 

 

Similar News