‘ సీఎం చంద్రబాబు’ స్కామ్ లకు వేదికగా సాగునీటి శాఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంత అడ్డగోలుగా నడుపుతున్నారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? ఏ శాఖలో అయినా పది లక్షల రూపాయలకు మించిన పనులు నామినేషన్ పై ఇవ్వటానికి వీల్లేదు. నిబంధనలు అందుకు అంగీకరించవు. కానీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు చెందిన కంపెనీలకు ఏకంగా చంద్రబాబు సర్కారు 1156 కోట్ల రూపాయల విలువ చేసే పనులను నామినేషన్ పై అప్పగించింది. అది కూడా మెమోల ద్వారానే. జలయజ్ణం ధనయజ్ణమే అని టీడీపీ నేతలు ఆరోపించిన వైఎస్ హయాంలో కూడా ఇంత బరితెగింపు కేటాయింపులు జరగలేదు. హంద్రినీవా ఫేజ్ 2లో 2,4,5,6 ప్యాకేజీలకు సంబంధించిన 1000 కోట్ల రూపాయల పనులను నామినేషన్ పైనే సీఎం రమేష్ కంపెనీలకు కట్టబెట్టారు. దీంతో పాటు గాలేరు-నగరిలో 156 కోట్ల రూపాయల విలువ చేసే 26 ప్యాకేజీ పనులను కూడా నామినేషన్ పైనే ఇచ్చారు. వేల కోట్ల రూపాయల పనులను నామినేషన్ పై ఇవ్వటం అంటే అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదని సాగునీటి శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇవి కాకుండా టెండర్ల ద్వారా కూడా సీఎం రమేష్ కంపెనీ సాగునీటి శాఖలో భారీ ఎత్తున పనులు దక్కించుకుంది. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీలో ‘టెండర్ల’ వ్యవస్థనే అపహస్యం చేస్తూ భారీ ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా వేల కోట్ల రూపాయల పనులను నామినేషన్ పై ఇవ్వటం ద్వారా అక్రమ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సీఎం రమేష్ పై ఐటి దాడులు ప్రారంభం కాగానే..టీడీపీ..మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ దీక్ష చేసి ఈ రోజుకి వంద రోజులు పూర్తయ్యింది అయినా కేంద్రంలో చలనం లేదు. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రాకుండా చెయ్యాలి అని మోడీ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల పై ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెన్నక్కి తగ్గేది లేదు.’
‘మోడీ ఆపరేషన్ గరుడలో భాగంగా ఆంధ్రుల పై దాడి. హోదా తో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలి అని నిలదీసినందుకు మోడీ ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టారు.మొన్న బీద మస్తాన్ రావు,నిన్న సుజనా చౌదరి,ఈ రోజు సిఎం రమేష్. కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు అని అన్నందుకు ఎంపీ సిఎం రమేష్ పై ఐటీ దాడులు.’ అంటూ వ్యాఖ్యానించారు లోకేష్. సీఎం రమేష్ కంపెనీకి 1156 కోట్ల రూపాయల పనులను నిబంధనలకు విరుద్ధంగా..ప్రభుత్వం అంటే మా సొంత కంపెనీ అన్న చందంగా కేటాయించటం కూడా ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమేనా?. దీనిపై కూడా లోకేష్ కాస్త వివరణ ఇస్తే బాగుండేది కదా?. ఓ వైపు ఐటి దాడులు జరుగుతున్నా కూడా చంద్రబాబు ఏ మాత్రం జంకకుండా నధుల అనుసంధానం పేరుతో గోదావరి-పెన్నా అనుసంధానం పేరుతో కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ లను ఎక్సెస్ రేట్లతో అస్మదీయ కంపెనీలైన నవయుగా, మెగా ఇంజనీరింగ్ లకు కట్టబెట్టడానికి రెడీ అయిపోయారు. ఇవి ఎవరి ప్రయోజనాల కోసం?.