తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. బాబ్లీకి సంబంధించి ధర్మాబాద్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రీకాల్ పిటీషన్ వేస్తూ చంద్రబాబు తరపున లాయర్లు శుక్రవారం నాడు కోర్టుకు హాజరయ్యారు. అయితే నోటీసులు అందుకున్న వారంతా విధిగా అక్టోబర్ 15న కోర్టు ముందు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు కోర్టు ముందు హాజరు కావటం తప్పనిసరి కానుంది. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను ధర్మాబాద్ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో చంద్రబాబుతో సహా మరో 19 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాశ్ గౌడ్‌లు శుక్రవారం నాడు కోర్టుకు హాజరయ్యారు.
అయితే చంద్రబాబు తన తరపున న్యాయవాదులను పంపించి రీకాల్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు తమకు ఎటువంటి నోటీసులు అందలేదని తెలిపారు. అంతేకాకుండా నాలుగు వారాల గడువు కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాము ఎవరికీ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అయిన కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని తెలిపింది. కోర్టుకు హాజరైన గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాశ్ గౌడ్‌లకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.