ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిది కేవలం పోస్ట్ మ్యాన్ పాత్రే. ఆయన పార్టీ అధిష్టానం అప్పగించిన పని చేశారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ నివాసంలో రేవంత్ రెడ్డి కూర్చున్న సీటులోనే 50 లక్షల రూపాయల బ్యాగ్ ఉంది. ఆ బ్యాగులో నుంచి రేవంత్ పక్కన ఉన్న వ్యక్తి ఎవరో నోట్ల కట్టలు తీసి బయటపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నామినెటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఓటు కోసం ఐదు కోట్ల రూపాయల బేరం మాట్లాడి...తొలి విడత 50 లక్షల బ్యాగుతో వీడియోల సాక్షిగా దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎమ్మెల్సీ గెలవటం వల్ల నేరుగా రేవంత్ రెడ్డికి వచ్చే లాభం ఏమీ లేదు. లాభం వస్తే గిస్తే అది చంద్రబాబుకే. అధికార టీఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించి రాజకీయంగా పై చేయి సాధించామనే ప్రయత్నం చేశారు అప్పుడు. అయితే పార్టీ అప్పగించిన పని చేయటంలో రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్లి బుక్ అయ్యారు. అయితే ఇక్కడ కేసు అంతా ఈ ఐదు కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి తేవాలనుకున్నారు?. ఇఫ్పటికే తెచ్చిన 50 లక్షలు ఎక్కడ నుంచి వచ్చాయి. ఇవీ కీలక ప్రశ్నలు.
సంవత్సరాల తరబడి ఈ కేసును వదిలేసిన తెలంగాణ సర్కారు ఇప్పుడు ఢిల్లీలోని విచారణ సంస్థలకు ఈ అంశంపై దర్యాప్తు జరపాలని లేఖ రాయటం ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే అన్న విమర్శలు విన్పిస్తున్నాయి. నిజంగా ఈ కేసును ఓ కొలిక్కి తేవాలనుకుంటే ఇదే పని ఎప్పుడో చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తేవటం...తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు వంటి అంశాలు కీలకపాత్ర పోషించాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ గత కొంత కాలంగా స్నేహపూర్వకంగా మెసులుకుంటున్నారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాజకీయ కారణాలతో కేంద్రం నుంచి బయటకు వచ్చారు.
అప్పటి నుంచే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మోడీలో బ్రిటీషర్ల లాంటి కొత్త మనిషి కన్పించటం ప్రారంభించారు. ఈ తరుణంలో రాజకీయంగా ఇద్దరికీ శత్రువు అయిన చంద్రబాబును ఈ కేసులో ఇరికించే ప్లాన్ పకడ్బందీగా సాగుతోందని చెబుతున్నారు. అయితే అటు చంద్రబాబు దగ్గర అయినా..ఇటు రేవంత్ రెడ్డి విషయం అయినా ఎప్పటి కేసుకో సంబంధించి ఇఫ్పుడు ‘ఆధారాలు’ దొరుకుతాయా? అన్నది సందేహమే. అయితే ఈ ఐటి, ఈడీ దాడులతో జరిగే నష్టం చాలు అని ప్లాన్ లో ఉన్నారేమో. ఏమి జరుగుతుందో వేచిచూడాల్సిందే.