మావోయిస్టుల చేతిలో అరకు ఎమ్మెల్యే హత్య

Update: 2018-09-23 11:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా మావోయిస్టులు జూలువిదిల్చారు. గత కొన్నేళ్ళుగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హత్య చేయటంతో కలకలం రేగింది. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోల చేతిలో మరణించారు. సర్వేశ్వరరావు వయస్సు 43 సంవత్సరాలే. ఆయన వైసీపీ టిక్కెట్ పై గెలిచి..తర్వాత టీడీపీలోకి వెళ్లారు. ఈ సంఘటనతో ఏపీ పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తం అయింది. భద్రతా లేకుండా ప్రజా ప్రతినిధులు ఎవరూ బయట తిరగొద్దని ఆదేశించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఘటనపై తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిలో కిడారి అనుచరులు మరికొంతమందికి కూడా గాయాలైనట్టు సమాచారం. కిడారి సర్వేశ్వరరావుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిడారిపై దాడి జరిగినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ నిర్ధారించారు.

మావోయిస్టులు హిట్‌ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. ఈ దాడిలో దాదాపు 50మంది మహిళ మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. తన క్వారీ మైనింగ్‌ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారి, ఆయన అనుచరులపై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో మహిళా మావోయిస్టులు అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపారు. గతంలోనూ పలుసార్లు కిడారిని మావోయిస్టులు బెదిరిస్తూ వచ్చారు. దాడి అనంతరం మావోయిస్టులు ఎటువెళ్లారనే దానిపై పోలీసులు గాలింపు చేపట్టారు. ఓ క్వారీ వివాదంలో ఎమ్మెల్యే వైఖరి కారణంగానే ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. డుంబ్రిగూడ ఘటనతో స్థానిక పోలీసు స్టేషన్ పై ప్రజలు దాడిచేశారు. నేతల్ని కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు.

 

 

Similar News