చంద్రబాబుకు కోర్టు నోటీసులు

Update: 2018-09-14 04:28 GMT

ప్రస్తుతం పాత కేసులను వెలికితీసే సీజన్ ఉన్నట్లు కన్పిస్తోంది. తెలంగాణలోనూ అదే నడుస్తోంది. ఎప్పటి కేసులో ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కూడా ఓ కోర్టు నోటీసు జారీ చేసింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చంద్రబాబు ధర్నా చేసినందుకు ఆయనకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు కావాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు 14మందిపై కేసు నమోదైంది. ఈ కేసును కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. మరోవైపు కేసుపై సీఎం చంద్రబాబు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గోదావరి పై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010సంవత్సరంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో 40మంది ఎమ్మెల్యేలు బాబ్లీ సందర్శనకు బయలుదేరారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం, దానికి అనుబంధంగా అనేక ఎత్తిపోతల పధకాల నిర్మాణాలు చేపట్టడం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గి, ఉత్తర తెలంగాణా ఎడారిగా మారుతుందని తెలుగుదేశం ఆందోళన చేపట్టింది.

తెలంగాణా సరిహద్దులు దాటి ఈ బృందం మహారాష్ట్రంలోని ధర్మాబాద్‌కు చేరుకున్న వెంటనే అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈ నోటీసులను టీడీపీ వ్యూహాత్మకంగా రాజకీయంగా వాడుకుంటోంది. ప్రధాని మోడీ ఈ నోటీసుల వెనక ఉన్నారంటూ సోషల్ మీడియాలో టీడీపీ ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు ఉండటంతో తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు పోరాడిన విషయాన్ని గుర్తుచేస్తూ రాజకీయంగా దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా కొంత మంది అయితే హీరో శివాజీ చెప్పిందే ఇదే అన్నట్లు లింక్ పెట్టేస్తున్నారు.

 

 

Similar News