మహానాడు వంటి కీలక కార్యక్రమంలో వేదికపై పెట్టే ఫ్లెక్సీలో కనీసం ఫోటోకు కూడా నోచుకుని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణకు సొంతంగా తెలంగాణలో పొత్తులు పెట్టుకునే ఛాన్స్ ఇస్తారా?. చంద్రబాబు తన నిర్ణయాధికారాన్ని రమణకు దఖలుపరుస్తారా?. ఇది ఏ మాత్రమైనా నమ్మే విషయమేనా?. మరి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎందుకు ఇలా చేస్తున్నారు. దీని వెనక వ్యూహాం ఏంటి?. మహానాడు వేదికపై వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ఫోటోలు మాత్రమే ఉంటాయి. కానీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణలకు అందరిలాగే వేదికపై సీటు ఉంటుంది తప్ప..ఎలాంటి నిర్ణయాధికారాలు ఉండవు. అలాంటిది ఇప్పుడు ఏకంగా తెలంగాణలో పొత్తు పెట్టుకునే అధికారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ కమిటీ కి అప్పగించారట. అంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే విమర్శలు వస్తాయని ఉద్దేశంతోనే చంద్రబాబు తెలివిగా ఈ నెపాన్ని తెలంగాణ కమిటీపైకి నెట్టేసి కొత్త గేమ్ ప్రారంభించటానికి రెడీ అయిపోయారు. ఏదైనా విమర్శలు వచ్చినా ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయం అని చెప్పాలన్నది వ్యూహం. రమణకు కేవలం పొత్తులు పెట్టుకునే ఛాన్స్ ఇస్తారా?. టిక్కెట్లపై కూడా ఎల్. రమణ సొంతంగానే నిర్ణయం తీసుకోవచ్చా?. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే అందులో చంద్రబాబు పాత్రేమీలేదంటే ప్రజలు నమ్ముతారా?.
ఈ పొత్తుపై పెద్దగా చర్చ జరగకూడదనే శనివారం నాడు ‘చంద్రబాబు’కు నోటీసుల వంటి కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చి సినిమా నడిపించారు. తీరా చూస్తే టీడీపీ అనుకూల మీడియాలోనూ ఆ వార్తలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. అంటే ఇదంతా ఏ మాత్రం నమ్మకానికి వీల్లేని సినిమానే అన్న విషయం అర్థం అయిపోయింది కదా?. మరి ఈ పొత్తుల సినిమాను చంద్రబాబు ఎన్ని మలుపులు తిప్పుతారో వేచిచూడాల్సిందే. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీల పొత్తులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. విచిత్రంగా బద్ధశత్రువులైన బిజెపితో పాటు ఎంఐఎం వంటి పార్టీ కూడా కాంగ్రెస్, టీడీపీల కలయికను తప్పుపడుతున్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.