‘పెనాల్టీ లేకుండా మా విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) రద్దు చేయండి. మాకు సాయం చేయండి’ అని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్ చంద్రబాబు సర్కారును కోరింది. దీనికి చంద్రబాబు సర్కారు కూడా సరే అంటూ ఆగమేఘాల మీద సాయం చేయటానికి రెడీ అవుతోంది. అసలు ఇదంతా దేనికి అంటారా?. అయితే ఓ సారి చూడండి. రిలయన్స్ పవర్ కు చెందిన కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ కృష్టపట్నంలో మెగా అల్ట్రా పవర్ ప్రాజెక్టు (యుఎంపీపీ) కు ఒప్పందం కుదుర్చుకుంది. 2007లోనే ఈ ఒప్పందం కుదిరింది. కానీ ఇఫ్పటి వరకూ ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. విదేశాల్లో బొగ్గు రేట్లు గణనీయంగా పెరగటం. మెగా ప్రాజెక్టుల కింద కంపెనీలు ఆఫర్ చేసిన యూనిట్ ధర అతి తక్కువగా ఉండటంతో ఇవి ఏ మాత్రం లాభదాయకం కాకుండా పోవటంతో కంపెనీలు అన్నీ వెనక్కి తగ్గాయి. అందులో రిలయన్స్ పవర్ కూడా ఒకటి. ఈ ప్రాజెక్టును అమలు చేయటంలో విఫలమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాను సేకరించిన భూమిని పాత ధరకే ప్రభుత్వానికి అప్పగిస్తామని చెబుతోంది.
అందుకు గాను ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసును విత్ డ్రా చేసుకోవటంతోపాటు లిక్విడేటెడ్ డ్యామేజెస్ వేయవద్దని కోరుతోంది. దీంతో పాటు బ్యాంక్ గ్యారంటీలను కూడా వెనక్కి ఇవ్వాలంటోంది. ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే ఎలాంటి భారం పడకుండా రిలయన్స్ కు లాభం చేకూరనుంది. కంపెనీ కోరిన మేరకు రిలయన్స్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకే చంద్రబాబు సర్కారు వేగంగా పావులు కదుపుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు..సర్కారుకు నష్టపరిహారంగా చెల్లించాల్సిన కోట్లాది రూపాయలు కూడా రిలయన్స్ కు మిగలనున్నాయి. ఎంతైనా అనిల్ అంబానీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడి మిత్రుడు కదా?. అందుకే ఈ నిర్ణయం అంటున్నారు అధికారులు.