వర్షాలు వచ్చాయంటే అమరావతిలో తాత్కాలిక సచివాలయం వణకాల్సిందే. ఒక్క సచివాలయమే కాదు..అందులోని మంత్రులు కూడా వణుకుతున్నారు. ఎందుకంటే వాన దెబ్బకు నీరు ఎడాపెడా కారుతోంది. అంతే కాదు..కొన్ని చోట్ల సీలింగ్ లు కూడా ఊడిపడుతున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు జరిగినా దిద్దుబాట్లు శూన్యం. కోట్లాది రూపాయల వ్యయంతో..అదీ రెగ్యులర్ ధరల కంటే అధిక ధరలు ఇచ్చి మరీ కట్టించిన సచివాలయం పరిస్థితి ఇది. ఏదైనా అంటే ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ కొత్త టెక్నాలజీ వాడాం అంటారు. ఇదేనేమో అది. వానొస్తే నీళ్లు లోపలికి వచ్చేలా నారాయణ ఓ కొత్త ప్రయోగం చేసినట్లు ఉన్నారు.
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుసున్న వర్షాలకు ఏపీ సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లలోకి నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు సీలింగ్‌లు ఊడిపడుతున్నాయి. మంత్రులు అమర్నాథ్‌రెడ్డి, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు ఛాంబర్‌ల్లో సీలింగ్ ఊడిపడి, ఏసీల్లోకి వర్షపు నీరు వచ్చిచేరింది. 4, 5వ బ్లాకుల్లోని పలు సెక్షన్లలో సీలింగ్ ఊడిపడింది. అసెంబ్లీ బిల్డింగ్‌లోనూ పలు చోట్ల సీలింగ్ ఊడిపోయి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. లీకేజీతో అసెంబ్లీ మొదటి అంతస్తులోని రిపోర్టింగ్ సెక్షన్‌లోకి వర్షలు నీరు వచ్చింది. ఆ ప్రాంతం అంతా ఇప్పుడు జలమయంగా మారింది.