తూర్పు గోదావరిలో టీడీపీకి షాక్!

Update: 2018-08-28 04:49 GMT

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుందా?. అంటే అవునని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలోకి దూకేందుకు రెడీ అయిపోయారు. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా ఆ పార్టీలో చేరనున్నారని జనసేన వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఉంటుందనే విషయం ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ విషయాన్ని గ్రహించే నేతలు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ అయితే తాము తేలిగ్గా గెలుస్తాం...మళ్ళీ తిరిగి అసెంబ్లీ అడుగుపెట్టేందుకు అనువైన పార్టీ ఏది అనే అంశంపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు.

అందులో భాగంగానే తోట త్రిమూర్తులు కూడా జనసేన వైపు మొగ్గుచూపుతున్నారని సమాచారం. ప్రస్తుతం తోట త్రిమూర్తులు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో తోట త్రిమూర్తులు పార్టీ అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు రైతు రుణ మాఫీ విషయంలో జిల్లాలోని రైతాంగం ఎక్కువ శాతం టీడీపీ అంటే వ్యతిరేకంగా ఉండటం, పవన్ పార్టీ వంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీలో ఉంటే గెలుపు కష్టం అవుతుందనే ఆయన జనసేన వైపు వెళ్ళటానికి రెడీ అయిపోయారని చెబుతున్నారు.

 

Similar News