ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటున్నారా?. కానే కాదు. ఓ ప్రేమ స్టోరీ. అదీ మైనర్లుగా ఉండగానే. ఏకంగా పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. ఏతావాతా విషయం తల్లితండ్రులకు తెలిసి..ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఆ అమ్మాయి వయస్సు 16 సంవత్సరాలు. అబ్బాయి వయస్సు 17 సంవత్సరాలు. ఇది కూడా ఫేస్ బుక్ , వాట్సప్ ల్లో పుట్టి..పెరిగిన ప్రేమ. తొలుతగా స్నేహంగా మొదలైన వ్యవహారం..సహజంగా ఆ వయస్సులో ఉండే అలవాటు ప్రకారం ప్రేమగా మారిపోయింది. ఇద్దరూ చదువు విషయంలో ఒకరిని ఒకరు చీట్ చేసుకున్నారు. తొమ్మిదో తరగతి చదివే అమ్మాయి తాను మెడికల్ స్టూడెంట్ ని అని క్లెయిం చేసుకుంది. ఇంటర్ చదివే కుర్రోడు మాత్రం తాను ఐఐటి స్టూడెంట్ గా చెప్పుకున్నాడు. ఇద్దరి చేతిలో స్మార్ట్ ఫోన్లే ఈ ప్రేమను అలా ముందుకు నడిపించాయి. అసలు వీరి ప్రేమ కథ ఎలా మొదలైందీ అంటే...కుర్రోడు కాకతాళీయంగా చేసిన ఓ ఫోన్ కాల్ అమలాపురంలోని ఆ బాలిక ఫోన్‌కు వెళ్ళింది.
అలా ఇద్దరి మధ్య ముందు మాటలు కలిశాయి. తర్వాత వాట్సాప్‌లో మెసేజ్‌లు... ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో చాటింగ్‌లు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఫోన్ కాల్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంకేముంది ఓ రోజు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇద్దరూ అప్పటి వరకూ ప్రత్యక్షంగా చూసుకున్నది కూడా లేదు. బాలుడు ఆ బాలికను రాజమహేంద్రవరం రమ్మన్నాడు. బాలిక ఇంట్లో చెప్పకుండా రాజమహేంద్రరం వెళ్లింది. గుంటూరు జిల్లా నుంచి ఆ బాలుడు అక్కడికి వచ్చాడు. ఇద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం అటు బాలుడు... ఇటు బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. మైనార్టీ తీరని ఆ ఇద్దరి వైపు తల్లిదండ్రులు పెళ్లికి ససేమిరా అన్నారు. అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు బాలుడిపై బాలిక కిడ్నాపు కేసు నమోదైంది. కేసు విచారణ సాగుతోంది.