హైదరాబాద్ లో ఆ ప్రాజెక్టుకు ఇచ్చింది సుమారు 15 ఎకరాలు. ఇది ఇచ్చింది కూడా చంద్రబాబు జమానాలోనే. ఇప్పుడు వైజాగ్ లో అచ్చం అలాంటి ప్రాజెక్టుకు ఇఛ్చింది కూడా 15 ఎకరాలే. ఇది ఇచ్చింది కూడా చంద్రబాబే. మరి అచ్చు అలాంటి ప్రాజెక్టుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏకంగా 84 ఎకరాలు ఎకరాలు ఎందుకు కేటాయిస్తున్నారు?. ఇది దోపిడీ కాకపోతే మరేమి అవుతుంది?. హైదరాబాద్, వైజాగ్ ప్రాజెక్టుల్లో లేని ప్రత్యేక సౌకర్యాలు ఏమైనా అమరావతి ప్రాజెక్టులో ఉన్నాయా? అంటే అదీ లేదు. అంతా ఇంచుమించు సేమ్ టూ సేమ్. కానీ దోపిడీ మాత్రం అంతు లేకుండా సాగుతోంది. అసలు ఏంటి ఈ సంగతి అంటారా?. మీరే చూడండి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైటెక్స్ ప్రాజెక్టుకు స్థలం కేటాయించారు. అక్కడే ఓ స్టార్ హోటల్ తోపాటు అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు అనుగుణంగా ఓ అంతర్జాతీయ మెగా కన్వెన్షన్ సెంటర్ వచ్చేసింది. ఇతర ఎగ్జిబిషన్ సెంటర్స్ కూడా నెలకొల్పారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అచ్చం ఇదే తరహా ప్రాజెక్టులను వైజాగ్ తోపాటు నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో అభివృద్ధి చేయాలని తలపెట్టారు. వైజాగ్ ప్రాజెక్టును అయితే దుబాయ్ కు చెందిన లూలూ గ్రూపునకు అప్పగించారు. ప్రైవేట్ సంస్థల భూములు తీసుకుని దానికి బదులుగా వుడాకు చెందిన వందల కోట్ల రూపాయల విలువైన భూములనను ఆ ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ఇది కూడా ఓ పెద్ద స్కామ్ అనుకోండి. ఇప్పుడు వీటన్నింటిని తలదన్నేలా ఏపీసీఆర్ డీఏని అడ్డం పెట్టుకుని మరో మెగా దోపిడీకి స్కెచ్ వేశారు చంద్రబాబు. తొలుత ఏపీసీఆర్ డీఏ మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ (ఎంఐసీఈ) ప్రాజెక్టు కోసం 42 ఎకరాలతో ప్రభుత్వ, ప్రైవేట్, భాగస్వామ్య (పీపీపీ) విధానం ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. కొద్ది రోజులకే దాన్ని తూచ్ అని...ఇప్పుడు మళ్ళీ ఆ ఎకరాలను ఏకంగా 84కు పెంచి మళ్ళీ ఆర్ఎఫ్ పీ జారీ చేశారు. దీనికి కారణం ఏంటి అంటే తమకు వందల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము అందజేస్తున్న అస్మదీయ సంస్థకు మేలు చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అత్యంత వాణిజ్య కేంద్రంగా మారే ఈ ప్రాంతంలో ఎకరా ధర సుమారు 4 కోట్ల రూపాయల లెక్కన వేసుకున్నా...సడన్ గా పెంచిన భూమి 40 ఎకరాల విలువ 160 కోట్ల రూపాయలు. అంచనాల పెంపు..ప్రాజెక్టులో ఇతర గోల్ మాల్స్ కలుపుకుంటే ఈ ఒక్క ప్రాజెక్టులోనే అవినీతి సుమారు రెండు వందల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు. ఒకే తరహా ప్రాజెక్టుకు హైదరాబాద్ లో 15 ఎకరాలు, వైజాగ్ లో 15 ఎకరాలు కేటాయించి..అమరావతిలో మాత్రం ఏకంగా 84 ఎకరాలు కేటాయించారంటే దీని వెనక ఏమి ఉందో ఊహించుకోవచ్చు. రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని ఏమి చేస్తున్నారనే విషయాన్ని ఈ డీల్ తేటతెల్లం చేసింది.